డీఎస్‌… ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌….. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు. ఏపీసీసీగా త‌న అనుభ‌వాన్ని పార్టీకి వినియోగించి అధికారంలోకి తెచ్చిన‌వాడు. ఉమ్మ‌డి ఏపీకి సీఎం కావాల్సిన వాడు. ఢిల్లీ పెద్ద‌ల‌తో మంచి సంబంధాలు నెరిపిన‌వాడు. ఇదంతా ఒక‌ప్ప‌టి ముచ్చ‌ట‌. ఇప్పుడు చిర‌మాంకంలో ఆయ‌న ప‌రిస్థితి ద‌య‌నీయం. అందుకు కార‌ణం ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు… ఇద్ద‌రు కొడుకుల మ‌ధ్య న‌లిగిపోతున్న వైనం.

అవును… ఇప్పుడు డీఎస్‌కు స‌న్ స్ట్రోక్ గ‌ట్టిగానే త‌గిలింది. పెద్ద కొడుకు వైపా..? చిన్న కొడుకు సైడా..? కాంగ్రెస్‌లో చేరాలా..? బీజేపీతో జ‌త క‌ట్టాలా..? ఎటూ తేల్చుకోలేని దుస్థితి. ఒక‌వేళ కాంగ్రెస్‌లో చేరితో చిన్న కొడుకు అర్వింద్‌తో తంటా. త‌న‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని… ఈ స‌మ‌యంలో తండి డీఎస్ కాంగ్రెస్‌లో చేరితో త‌న శ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీర‌వుతుంద‌ని …. తండ్రి ముంద‌రికాళ్ల‌కు బంధాలేశాడు అర్వింద్‌. అయితే బీజేపీలో చేరు.. లేదంటే రాజ‌కీయ జీవితాన్ని అలా నాలుగు గోడ‌ల‌కు ప‌రిమితం చేసుకో అని ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చేశాడు. ఒక‌వేళ బీజేపీలో చేరితో .. త‌న‌కే ఏ ప‌ద‌వీ ఉండ‌దు… ఇక త‌న‌మీదే ఆధార‌ప‌డ్డ పెద్ద కొడుకు సంజ‌య్‌కు ఏం ఉంటుంది…? కాంగ్రెస్‌లో చేరితో నిజామాబాద్ అర్బ‌న్ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకోవ‌చ్చు.

త‌న జీవిత చివ‌రి ఘ‌డియ‌లు పార్టీతో ముడిప‌డి ఉన్నాయ‌నే సంతృప్తి ఉంటుంద‌నే భావ‌న‌లో డీఎస్ ఉన్నాడు. కానీ అర్వింద్ ఇది కానిస్త‌లేడు. ముడిప‌డ‌నిస్త‌లేడు. ముందుకు అడుగు ప‌డ‌నిస్త‌లేడు. దీంతో ఏమి చేయాలో తెలియ‌క డీఎస్ త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం గ‌డువు ముగిసినా ఏటూ తేల్చుకోలేక అజ్ఞాతానికే ప‌రిమ‌త‌మ‌య్యాడు. ఎవ‌రితో క‌ల‌వడం లేదు. ఎవ‌రితో మాట్లాడ‌టం లేదు. ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాడు. ఏమి చేయాలో అర్థం కాని ప‌రిస్థితి. ఇద్ద‌రి కొడుకుల మధ్య న‌లిగిపోతున్నాడు. కాంగ్రెస్‌లోకి డీఎస్ వెళ్ల‌క‌పోతే సంజ‌య్ భ‌విష్య‌త్ అగ‌మ్య‌గోచ‌ర‌మే. ఇప్ప‌టికే సంజ‌య్ కూడా కాంగ్రెస్ టికెట్ వ‌స్తుంద‌ని అంతా రెడీ చేసుకున్నాడు. చివ‌రికి ఇలా అయ్యింది..

దీంతో ఆఖ‌రికి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయ‌డానికి ముంద‌స్తు ప్లానింగ్ వేసుకుంటున్నాడు సంజ‌య్‌. కానీ అదంతా ఈజీ కాదు. అది అంద‌రికీ తెలుసు. ఇప్పుడు పెద్ద కొడుకు వైపుండాలా..? చిన్న కొడుకు చెప్పింది వినాలా..? డీఎస్‌కు ఇదే అంతు ప‌ట్ట‌ని స‌మ‌స్యై కూర్చుంది. ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాడు. అజ్జాత‌వాసంలో ఉండిపోయాడు. ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తాడో తెలియ‌దు. ఇంకెన్ని నెల‌లు ప‌డుతుందో తెలియ‌దు… ఆయ‌న భ‌విష్య‌త్తు ఆయ‌న‌కే అంతుచిక్క‌డం లేదు. డీఎస్ రాజ‌కీయ జీవితంలో ఇదో విషాదం…

You missed