ఆగ‌మైన ఇందూరు గులాబీ గూటికి మ‌ళ్లీ కొత్త వెలుగులు రానున్నాయి. ఎంపీగా క‌విత ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి జిల్లాలో ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అనాథ‌లుగా మారారు. ఎవ‌రు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నో ఏండ్లుగా ఓపిక పట్టి… పార్టీనే అంటిపెట్టుకున్న చాలా మంది క‌విత ఓట‌మిని జీర్ణించుకోలేదు. అందులోనూ ఆమె ఎవ‌రితో క‌ల‌వ‌కుండా అజ్ఞాత‌వాసం చేయ‌డం ఇంకా ఇబ్బందిక‌ర ప‌రిణామ‌లు తెచ్చిపెట్టాయి. జిల్లాలో ఎమ్మెల్యేల‌ను గెలిపించుకునేందుకు ఆమె విశేషంగా శ్ర‌మ ప‌డ్డారు. రెండు, మూడు స్థానాల్లో జిల్లాలో టీఆరెస్ ఓడిపోయేది.

కానీ ఆమె ప‌ట్టుబ‌ట్టి .. అంద‌రినీ ఒక్క‌తాటిపైకి తెచ్చి గెలిపించుకున్న‌ది. టీఆరెస్ జిల్లాలో కంచుకోట అని మ‌రోసారి నిరూపించింది. అయితే తన‌దాకా వ‌చ్చేస‌రికి ప‌రిస్థితి తారుమ‌ర‌య్యింది. ఆమె ఘోర ఓట‌మిని చ‌వి చూడాల్సి వ‌చ్చింది. మితి మీరిన ఆత్మ‌విశ్వాసం కొంప ముంచింది.కొంద‌రు ఎమ్మెల్యేల ప‌ట్టింపులేనిత‌నం, నిర్ల‌క్ష్య వైఖ‌రి క‌విత రాజ‌కీయ జీవితాన్ని గంద‌ర‌గోళంలో ప‌డేసేలా చేశాయి. ఆ త‌ర్వాత ఆమె అవ‌మాన‌భారంతో చాలా రోజులు జిల్లా వైపు చూడ‌లేదు. ఎవ‌రికీ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. త‌నే ఓ వైరాగ్యంలో ఉన్న‌ట్టుగా ఉండిపోయింది.

దీంతో ఆమెనే న‌మ్ముకుని ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న‌వారు, ఆమె మాట‌ల‌తో, హామీల‌తో పార్టీలోకి వ‌చ్చిన నేత‌లు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు అంధ‌కార‌మ‌నే భావించారు. ఆమెకే ప‌ద‌వుల్లేవు. ఇక మాకెవ‌రిస్తారు..? మ‌మ్మ‌ల్నెవ‌రు ప‌ట్టించుకుంటారు..? అని పెద‌వి విరిచి రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతూ..ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిణామాలు గ‌మ‌నిస్తూ ఉన్నారు. క‌విత స్థానికంగా లేక‌పోవ‌డం, అందుబాటులో ఉండ‌క‌పోవ‌డంతో ఎమ్మెల్యేలు కూడా ఎవ‌రినీ ప‌ట్టించుకోలేదు. అంతా ఎవ‌రికి వారే య‌మునా తీరేలా పార్టీ ప‌రిస్థితి మారింది. స‌మ‌న్వ‌యంతో అంద‌రినీ ఒక్క‌తాటిపైకి తెచ్చే శ‌క్తి లేకుండా పోయింది.

క‌విత లేని లోటు , ప్ర‌భావం పార్టీపై స్ప‌ష్టంగా క‌నిపించింది. చాలా రోజుల త‌ర్వాత లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీగా ఎన్నికైనా.. ఆమె ఆ ప‌ద‌విలో ఎక్కువ‌కాలం కొన‌సాగ‌లేక‌పోయింది. ఆ ఎమ్మెల్సీ తీసుకున్న‌దే మంత్రి ప‌ద‌వి కోసం. కానీ ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. కేసీఆర్ కూడా మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు వెనుకాముందాడాడు. ఓడిన క‌విత‌ను వెంట‌నే మంత్రిని చేయ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేదు. ఇక రెండోసారి కూడా ఇదే చ‌ర్చ చివ‌రి వ‌ర‌కూ సాగింది. అంతిమంగా పార్టీ మ‌నుగ‌డ‌కు ఆమె స్థానికంగా బ‌లోపేతం కావ‌డం అనివార్య‌మ‌ని అధిష్టానం గ్ర‌హించింది. ఆమె లేని పార్టీ ఇక్క‌డ అనాధేన‌న్న విష‌యం ఈ రెండేండ్ల‌లో స్ప‌ష్ట‌మైంది. అప్ప‌టికే చాలా న‌ష్ట‌మే జ‌రిగింది.

మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయింది. ప‌డుకున్న బీజేపీని త‌ట్టి లేపి.. ఉరుకులు పెట్టించింది ఇక్క‌డ లోక‌ల్ టీఆరెస్ క్యాడ‌ర్. వీరి స‌మ‌న్వ‌య లోపం బీజేపీకి బాగా క‌లిసి వ‌చ్చింది. అర్వింద్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క అర్బ‌న్ టీఆరెస్ నేత‌లు ప‌లాయ‌న‌వాదం చిత్త‌గించారు. పారిపోయారు. బీజేపీ విస్త‌రిస్తూ వ‌స్తున్న‌ది. టీఆరెస్ కంచుకోట‌కు బీట‌లు వార‌తూ వ‌చ్చాయి. మరోవైపు పార్టీనే న‌మ్ముకుని ..దీన్ని ప‌ట్టుకుని వేలాడుతున్న చాలా మందికి ఇందులో భ‌విష్య‌త్తు క‌నిపించ లేదు. ఎటు పోవాలో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. ఈ స‌మ‌యంలోనే మ‌ళ్లీ క‌విత‌కు లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీని చేయాల‌ని, ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించాడు.

ఈ ప‌రిణామం జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు తెర‌తీసింది. కొత్త స‌మీక‌ర‌ణ‌లు, కొత్త ప‌రిణ‌మాల‌కు దారి తీసింది. ఇక మ‌ళ్లీ ప‌ట్టు నిలుపుకుని పూర్వ‌వైభవం దిశ‌గా పార్టీ ముందుకు సాగేలా క‌విత దిశానిర్ధేశం చేయ‌నున్నారు. త‌న‌ను న‌మ్ముకున్న వారికి ఓ లైఫ్‌లైన్ కానున్నారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న‌వారికి ఓ గాడ్ ఫాద‌ర్‌లా అండ‌గా నిల‌వ‌నున్నారు. ఇన్నాళ్లూ త‌మ‌కు తిరుగులేద‌నుకుని పార్టీకి న‌ష్టం చేసిన టీఆరెస్ లీడ‌ర్లకూ చెక్ ప‌డ‌నుంది.

You missed