రేపు పోలింగ్‌. ఈ రాత్రి కీల‌కం. మూడు రోజులుగా డ‌బ్బుల పంపిణీ జోరుగా సాగుతున్న‌ది. టీఆరెస్‌, బీజేపీలు పోటీలు ప‌డి పంచుతున్నాయి. నాకు రాలేదంటే.. నాకు రాలేద‌ని రోడ్ల మీద‌కు జ‌నాలు వ‌స్తూనే ఉన్నారు. లొల్లి చేస్తూనే ఉన్నారు. మీడియాలో ఆ క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. డ‌బ్బుల వ్య‌వ‌హారంలో నువ్వు దొంగంటే నువ్వు దొంగ అనుకుంటూనే ఈ రెండు పార్టీలు ఎవ‌రికి వారే పంప‌కాలు చేస్తూనే ఉన్నారు. కాక‌పోతే ఎక్కువ త‌క్కువ‌ అంతే. మొన్న‌టి వ‌ర‌కు ఒక‌రిపై ఒక‌రు చేసుకున్న ఫేక్ ప్ర‌చారాల్లో ఈ డ‌బ్బులు నువ్వింతిస్తున్నావంటే.. నువ్వింతిస్తున్నావ‌ని ఒకరిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకున్నారు. ఇది చూసి మాకు రాలేదంటే మాకు రాలేద‌ని ఓట‌ర్లు గ‌గ్గోలు పెడుతూ రోడ్డెక్కారు.

మొత్తానికి అధికార పార్టీ ఈ ఉప ఎన్నిక‌ను మ‌రీ ఖ‌రీదు చేసేసింది. ఇదే సంస్కృతి గ‌నుక ముందు ముందు కొన‌సాగితే.. పోటీ చేసే అభ్య‌ర్థులు భారీగా ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం స‌మ‌కూర్చుకోవాల్సి వ‌స్తుంది. సరే, ఇదే చివ‌రి ఘ‌ట్టం.. ఎవరెంత ఇచ్చి ప్ర‌లోభ‌పెడితే వారికే లాస్ట్ మూమెంట్‌లో ఓట్లు బాగా ప‌డ‌తాయి అనుకున్నారంతా. కానీ ఇప్పుడు చివ‌ర‌గా వ‌రి రాజ‌కీయాన్ని వాడుకునేందుకు సిద్ద‌ప‌డ్డారు. ఇందులో టీఆరెస్‌ను ఇరికించేందుకు బీజేపీ శ‌త‌విధాల ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. బండి సంజ‌య్ ప్లాన్ ప్ర‌కారం దీక్ష చేశాడు. కేసీఆర్‌ను చెడామ‌డా తిట్టాడు. కేంద్రం కొంటుంద‌ని చెప్పిస్తావా..? రాజీనామా చేస్తా అని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి స‌వాల్ విసిరితే దాన్ని ప‌ట్టించుకోలేదు.

ఈ రోజు అర్వింద్ కూడా దీనిపైనే ప్రెస్ మీట్ పెట్టాడు. అటు తిప్పీ ఇటు తిప్పీ కేంద్రం త‌ప్పేమీ లేదు. వ‌రి కొనుగోలు చేయ‌మ‌ని చెప్ప‌లేద‌ని, బాయిల్డ్ రైస్ మాత్రం రాకుండా చూసుకోండి.. ప్ర‌త్యామ్నాయాలు వెతుక్కోండ‌ని సూచించింద‌నీ చెప్పుకొచ్చాడు. ప‌నిలోప‌ని త‌న‌కు అల‌వాటైన దోర‌ణిలో కేటీఆర్‌ను, కేసీఆర్‌ను ఎడాపెడా చెడామ‌డా నోటికొచ్చిన‌ట్టు తిట్టి ఊరుకున్నాడు. వానాకాలం సీజ‌న్ వ‌రంతా ఎవ‌రు కొంటున్నారు… ? కేంద్రం కాక‌పోతే… అని త‌న స‌హ‌జ సిద్ధ దోర‌ణిలో క్లారిఫికేష‌న్ ఇచ్చుకున్నాడు. మ‌రి అదే క‌దా టీఆరెస్ కూడా అంటున్న‌ది. యాసంగిలో వేయ‌కండ‌ని. ఇప్పుడు ఇదే టీఆరెస్ కొంప‌ముంచేలా ఉంది. దీనికీ అర్వింద్ త‌న‌దైన భాష్యం చెప్పాడు. మ‌రి ఇన్నేండ్లు యాసంగి సీజ‌న్‌లో వేరే పంట‌ల వైపున‌కు రైతుల‌ను ఎందుకు మ‌ళ్లించ‌లేక‌పోయావు..? అని కేసీఆర్‌ను టార్గెట్ చేశాడు. దీన్నిఎంత మేర వాడుకుంటే అంత బీజేపీకి లాభం వ‌స్తుందేమోన‌ని వాళ్ ఆశ‌. కాంగ్రెస్ మాట్లాడింది కానీ, హుజురాబాద్‌లో దీని వ‌ల్ల దానికొచ్చే ఉప‌యోగ‌మేమీ లేదు.

తాజాగా..మ‌రో కొత్త వార్త తెర‌పైకి వ‌చ్చింది. రాజేంద‌ర్ పీఆర్వో చైత‌న్య‌.. త‌న వాట్సాప్ గ్రూపులో .. వ‌రి వేస్తే ఆ రైతుకు రైతుబంధు బంద్ చేయాల‌ని ఎన్నిక ముగియ‌గానే కేసీఆర్ ప్ర‌క‌టిస్తాడు…దీన్ని ప్ర‌చారం చేస్తే ఉప‌యోగం ఉంటుందేమో ప‌రిశీలించండి.. అని బీజేపీ శ్రేణుల‌ను కోరినట్టుగా ఆ వాట్సాప్ స‌మాచారం ఉంది. అంటే ఓ త‌ప్పుడు వార్త‌ను క్రియేట్ చేసి .. దాని ద్వారా టీఆరెస్‌పై వ్య‌తిరేక‌త‌ను మ‌రింత పెంచి లాభం పొందాల‌ని చూస్తున్నార‌ని టీఆరెస్ పార్టీ శ్రేణులు దీనిపై గ‌గ్గోలు పెడుతూ పోస్టింగులు పెడుతున్నారు. మొద‌టి నుంచి లాస్ట్ వ‌ర‌కు ఇలా త‌ప్పుడు వార్త‌ల‌తోనే ఈ రెండు పార్టీలు త‌మ‌దైన శైలిలో కొత్త ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టాయి. తెల్లారి పోలింగ్ అన‌గా.. ఇలా వ‌రి రాజ‌కీయాన్ని కూడా బీజేపీ వ‌ద‌ల్లేదు. ఇది రేపు పోలింగులో ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో చూడాలి.

You missed