(దండుగుల శ్రీనివాస్)
ఎన్నికలకింకా చాలా రోజులే ఉంది. ఇప్పుడే ఎన్నికలలో. అన్ని పార్టీలకు. మాకు వందంటే. మాకు వందంటుండ్రు. మంది ఆగమతైంటే రాజకీయాలే ముఖ్యమయ్యాయి వీళ్లకు. ఇది మొదాలు షురూ చేసింది రేవంతు. చేసింది గోరంత కూడా లేదు. చేయాల్సింది కొండంతుంది. ఇప్పటికే జనం విసిగిపోయి ఉన్నరు కాంగ్రెస్ మీద. రేవంతుడి పాలన మీద. చూస్తుంటే రెండేండ్లు గడిచిపోయినయి. కేసీఆర్కు మించి ఏమన్నా చేసిండా ఏమీ చేయలే. ఒక్క సన్నబియ్యం ఇచ్చుడు తప్ప.
ఇగ దీని గురించి డబ్బా కొట్టుడు మాత్రం మామూలుగా లేదు. కడుపునిండా తింటుండ్రు.. కడుపు నిండా తింటుండ్రు. అబ్బబ్బ.. అంతకు ముందు అసలు బియ్యమే దిక్కులేనట్టు.. అన్నం ముద్దనే నోట్లకు దిగనట్టు. రుణమాఫీ సంపూర్ణం కాలే. రైతు భరోసా ఆపి ఆపి.. కోతలు వాతలు పెట్టీ పెట్టీ..లాస్టుకు మొన్నేసిండు. పండుగ చేస్కోండన్నడు. రాజీవ్ యువవికాసం పేరుతో నిరుద్యోగుల మోచేతికి బెల్లంపెట్టి అరచేతితో నాకించినట్టే చేసిండు. దరఖాస్తులకే చేతిచమురు వదిలింది పోరగాళ్లకు. అట్లుంటది మరి రేవంతుతోని. అని అంతా అనుకుంటుంటే.. మొన్న పార్టీ మీటింగులు ఢిల్లీ పెద్దల ముందు షోకుల పోయేందుకు.. వంద గెలుస్తా పక్కా.. కావాలంటే రాస్కోర్రి.. ఒక్కటి తగ్గినా నా ముఖం మీకు సూపియ్య అనే రేంజ్లో సినిమా డైవిలాగులు కొట్టె. అప్పులు, అప్పులు, వడ్డీలు, వడ్డీలు.. నడ్డిరిగింది.. ఇప్పట్ల మనం లేవలేమనే కదా జనాలకు చెప్పుకుంట వచ్చి.. హామీల ఆశలను ఆవిరి చేసి… పథకాలకు బ్రేకులు వేసి.. సర్కార్ను నడిపిస్తున్నది.
మరి ఇంక మింగిలిన మూడేండ్లళ్ల అద్భుతాలేమైనా చూపిస్తడా ఏందీ..? మరి వాటికైనా అప్పులు కుప్పలు కుప్పలు చేయాలె గదా. చేస్తడేమో. అధికారం కావాలంటే అంతే మరి. ఇక రామన్న అన్నడు వందనా నీ బొందనా ..? అని. ఎవడేస్తడు వయా నీకు ఓటు.. ఎవనికి మేలు చేసినవ్.. ఎవడు సంతోషంగా ఉండు..? నీ తొట్టి గ్యాంగు తప్ప అన్నడు. మరే.. రామన్నా.. మనకు ఎవలి ఓట్లు మిస్ అయినయే. ఎవలివి తక్కువవడ్డయి.? ఎందుకు తగ్గినయి..? మనం చేసి పాపమేందే..? లోపమేందో..? అది కూడా ఇట్ల మాట్లాడినప్పుడల్లా చెంపలేసుకున్నట్టు తప్పయిందనే మాటకొకటి చెప్పుర్రి జనాలకు. మళ్లోపారి ఇసొంటి తప్పులు చేయమని కూడా చెప్పవే పనిలో పని. అబ్బ మీరు మారిండ్రు.. అని జనం నమ్మేటట్టు మాట్లాడు.
ఎందుకంటే ఇప్పటికీ ఇంకా మనం మీద గురి కుదర్తలేదే జనాలకు. ఇట్లనే ఉంటే మనకు కూడా రావే వంద. ఇగ బీజేపీ కొత్త సారథి వచ్చి ఛల్.. మీకెక్కడివి వయా వంద..! వస్తే గిస్తే మాకే రావలె గానీ అన్నడు. అబ్బ ఆశకు అంతులేదు పో. ఏం చేసిండ్రే మీరు. అయినా గీ రెండు పార్టీలతో తట్టుకునేంత ఉందానే రాంచంద్రన్నా మీకు. రైతుబంధు ఇస్తరా..? పింఛన్ నాలుగు వేలంటుర్రు.. అదైతా మీతోని. రామ్.. రామ్.. జై శ్రీరామ్ అంటే ఓట్లు పడి సీట్లు గెలిచి వందకు పోరే అన్నా..? మనం ఏడున్నమో ఆడనే ఉంటం. హామీలు గుప్పియ్యాలె. జనాన్ని బురిడీ కొట్టించాలె. ఆనక ఛస్.. బంగారు లంకెబిందెలనుకున్నం.. బిచ్చపు చిప్పలే ఉన్నయి ఈడ అని పవర్ ఎంజాయ్ చేయాలె. లాస్ట్ వరకు. ఆ తరువాత మళ్లీ షరా మామూలే. ఇప్పుడు తెలంగాణల గిదే ట్రెండ్ నడుస్తుంది. ఆ లోగుట్టు రెండు పార్టీలకే ఎరుక.
Dandugula Srinivas
Senior Journalist
8096677451
