(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఏ వ‌ర‌మ్మ‌డిగినా ఇత్తును పతి ప్రాణ‌ముద‌క్క‌…!అని స‌తీసావిత్రి క‌థ‌లో యముడి డైలాగులను వ‌ద‌లుతున్న‌దిప్పుడు కాంగ్రెస్. కేటీఆర్ స‌వాల్ విసిరాడు క‌దా రేవంత్‌కు. రా చ‌ర్చించుకుందాం.. ఎనీ సెంట‌ర్‌, ఎనీ ప్లేస్… అంటూ డేటు, టైము ఫిక్స్ చేసి పోయాడు. ఇది స‌ర్కార్‌కు ఇరుకున‌పెడుతుంద‌ని బీఆరెస్ భావిస్తున్న‌ది. కానీ రేవంత్.. ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ ద్వారా ఓ వీడియోను విడుద‌ల చేయించాడు.

ఏమున్న‌దందులో. నువ్వెవ‌రోయ్‌.. వ‌చ్చేందుకు.. ర‌మ్మ‌నేందుకు..! నువ్వేమ‌న్నా ప్ర‌తిప‌క్ష నేత‌వా..? మేము మీ అయ్య‌తోనే మాట్లాడ‌తాము. నీకొక‌సారి, నీ బావ‌కొక‌సారి, నీ చెల్ల‌కొక‌సారి మేం చెప్ప‌జాల‌ము. అందుకే అసెంబ్లీ వేదిక‌గా చెప్తాము.. మీ డ్యాడీని తీసుకొద్దువా..! అన్నాడు. ఇదే కాంగ్రెస్ కండిష‌న్‌. కాలికేస్తే వేలికి. వేలికేస్తే కాలికి. మ‌రి కేటీఆర్ పిలువ‌గానే, స‌వాల్ విస‌ర‌గానే వ‌స్తే మాకేముంటుంది ఇజ్జ‌త్ అనుకున్నారో… ఏమో. అందుకే ఈ ఫిటింగు పెట్టారు.

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన‌నాటి నుంచీ ఇదే ఫిటింగు ఉండ‌నే ఉంది. అంటే ఆయ‌న రాడు. వీళ్ల చెప్ప‌రు. అందుకే మ‌రోసారి కేటీఆర్ విసిరిన స‌వాల్‌ను తిప్పికొట్టేందుకు అద్దంకి ద్వారా ఈ అస్త్రం ప్ర‌యోగించాడు రేవంత్‌. అసెంబ్లీ వేదిక‌గా బాగుంటుంద‌ని అనుకుంటున్నాము… ఒక‌వేళ మీరెక్క‌డికైనా స‌రే ర‌మ్మంటే వ‌స్తాము.. కానీ మీ డ్యాడీ కూడా ఉండ‌వ‌లె.. అదీ ష‌ర‌తు.. అన్నాడు అద్దంకి.

అంటే ఈ స‌వాలును స్వీక‌రించిన‌ట్టే స్వీక‌రించి.. ప‌తి ప్రాణ‌ముల్ ద‌క్క అని య‌ముడ‌న్న‌ట్టుగా.. మీనాన్న వ‌స్తేనే సుమీ.. అంటూ కండిష‌న్ అప్లై అనే ట్యాగ్‌లైన్ జోడించింది కాంగ్రెస్‌. దీనికింత‌టితో పుల్ స్టాప్ ప‌డిన‌ట్టేనా.. 8 వ తేదీ నాడు కూడా ర‌చ్చ రంబోలా ఉంటుందా..? చూడాలి.