(దండుగుల శ్రీనివాస్)
వాస్తవం చెప్పిందే నిజమైంది. కవిత మరో షర్మిలలా మారనుంది. కొత్త పార్టీ పెట్టనుంది. ఆ పార్టీలో కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ చిచ్చురేపనుందని పద్దెనిమిది రోజుల ముందే వాస్తవం డిజిటల్ పత్రికలో ఎక్స్‌క్లూజివ్ కథనం వచ్చింది. దీన్ని అంతా కొట్టిపారేశారు. ఆమెకు అంత సీన్ లేదన్నారు. కొత్త పార్టీ పెట్టి మనగలిగే దమ్మెక్కడిదని ప్రశ్నించారు. ఆమె ఇంకా తండ్రి చాటు బిడ్డనే… కేసీఆర్ ను ఎదురించే శక్తి లేదన్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కవిత తండ్రి పై ధిక్కార స్వరం వినిపించింది. లేఖ రాసింది. ఆమె అమెరికాకు వెళ్లిన తరువాత ఈ లేఖను లీక్ చేశారు. కానీ వాస్తవం డిజిటల్‌లో మాత్రం అప్పుడే లేఖ రాసిన వైనాన్ని ఆమె కొత్త పార్టీకి అడుగులు వేస్తున్న విధానాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా విశ్లేషించింది. వరంగల్ సభను బేస్ చేసుకుని ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది కేసీఆర్‌పై. సభ వరంగల్ దే. కానీ అనుమానాలు చాలా రోజులుగా ఆమెలో వేళ్లూనుకుని ఉన్నవే.
సమయం కోసం చూసింది. ఇప్పుడిలా బయట పెట్టింది. బీజేపీ , బీఆరెస్ కలవబోతున్నాయనే సంకేతాలిచ్చింది. కేటీఆర్ కు ఆధిపత్యం ఇచ్చి పార్టీని మరింత నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓడిన ఎమ్మెల్యేలకే మళ్లీ ఇంచార్జి బాధ్యతలు ఎందుకిచ్చారని కేసీఆర్‌ను నిలదీసింది. బీసీ రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదని కడిగేసింది. ఉర్దూలో మాట్లాడలేదు.. వక్ఫ్ భూములపై ప్రసంగంలో చోటులేదు… బీజేపీని తిట్టిన దాఖలాలు లేవు.. ఎందుకు..? ఎందుకు..?? ఎందుకు..??? అని ప్రశ్నల పరంపర కొనసాగించింది. ఉద్యమకారులతో ఎందుకు కలుస్తలేవు..? వేదిక మీద సీనియర్లతో ఎందుకు మాట్లాడనిస్తలేవు. పార్టీని భ్రష్టుపట్టించి, ప్రభుత్వం ఓడటానికి కారణమైన మాజీ ఎమ్మెల్యేలకు ఇంచార్జిలుగా ఇవ్వడమే కాకుండా లోకల్‌బాడీలో వారే బీఫామ్‌లు ఇచ్చేలా చేస్తారా..? ఇంతకన్నా దౌర్బాగ్యం మరోటి లేదు. నీ నుంచే బీ ఫామ్‌లు రావాలె అని తండ్రిని టార్గెట్ చేసింది.