బోధన్ ఎమ్మెల్యే షకీల్.రాష్ట్రంలోనే ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే ఆయన. కేటీఆర్‌తో మంచి సంబంధాలున్నాయి. కవిత మెట్టినింటి నియోజకవర్గం. ఆమెతో కూడా సత్సంబంధాలే ఉన్నాయి. లౌక్యం తెలిసినవాడు. మంచి వక్త. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై రెండు సార్లు గెలిచాడు. మంత్రి అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. మైనార్టీ ఎమ్మెల్యేగా తనకు అవకాశం తప్పకుండా ఇస్తారని భావించాడు. వేచి చూశాడు. పార్టీ అధిష్ఠానం వినలేదు. మధ్యలో ఓసారి ఎంపీ అర్వింద్‌ను కలిశాడు. ఇది వివాదానికి తెరతీసింది. వెంటనే రంగంలోకి దిగిన కేటీఆర్ .. షకీల్‌ను పిలిపించి మాట్లాడాడు. అంతా సద్దుమణిగిందనుకున్నారు.
కానీ ఇటీవల షకీల్ తండ్రి మరణం ఆయనను క్రుంగదీసింది. కానీ పార్టీలో పెద్దలెవరూ తనను పట్టించుకోలేదన్న బాధ మరింత వెంటాడింది. అప్పటికే పార్టీపై తీవ్ర అసంతృప్తి, నైరాశ్యంలో ఉన్న షకీల్ మొన్నటి వరకు అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. ఇటీవల బయటకు వచ్చినా.. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కొందరికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన తన వ్యాపార పనిలో బిజీగా ఉన్నాడు.
వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టాడు. మొన్నటి వరకు పార్టీ తనకు ఏదో చేస్తుందని, ఏదో అవుతాననే ఊహల ప్రపంచంలో తేలియాడిన షకీల్.. నేలమీదకు వచ్చాడు. తత్వం బోధపడింది. తన వైరాగ్యాన్ని తనను కలిసిన సన్నిహితులతో పంచుకుంటున్నాడు. ‘ఇదేం పార్టీరా బై.. ఇందులో ఉంటే ఇక అంతే సంగతులు.. మన బతుకులు మరీ దారుణంగా మారుతయ్.. మన పని మనం చేసుకోవాల్సిందే.’ అంటూ సన్నిహిత మిత్రులతో తన మనసులోని మాట బయటపెడుతున్నాడట. ‘నేనొక మైనార్టీ ఎమ్మెల్యేను ఉన్నాననే విషయమైనా వారికి తెలుసా?’ అని పార్టీ పెద్దలనుద్దేశించి తనకు జరుగుతున్న అవమానాలను ఏకరువు పెడుతున్నాడట. దీంతో షకీల్ రాజకీయ భవిష్యత్ ఏంటీ? ఆయన ఏ పార్టీ వైపు చూస్తున్నాడు.? అనే ప్రశ్నలు తాజాగా ఉత్పన్నమవుతున్నాయి.