టికెట్లిచ్చేశాం.. ప్రచారం చేసుకోండి… అని కేసీఆర్‌ ప్రకటించేసినా… ఆయన ఈ ఎన్నికలను అంత సులువుగా తీసుకోవడం లేదు. అసలు ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులనే ప్రకటించక గింజుకుంటున్న తరుణంలో ఆయన సిట్టింగులకు రంగంలోకి దింపేశారు. ఎవరి జోరు మీద వారున్నారు. ఇక గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిస్తూ అసంతృప్తులను చేరదీస్తున్నారు. ఖర్చుకూ వెనుకాడటం లేదు. కానీ కేసీఆర్‌ మాత్రం టికెట్లు ప్రకటించిన మరుసటి రోజు నుంచే సీక్రెట్ సర్వే మొదలు పెట్టించారు. టికెట్‌ ఇచ్చిన తర్వాత నాయకుల్లో ఎలాంటి స్పందన ఉంది…? ప్రజలేమనుకుంటున్నారు..?? అసంతృప్తి, వ్యతిరేకత ఏ స్థాయిలో బయపడుతుంది..? గెలుపు కోసం ఎంతలా శ్రమించాలి..?? ఓటమి అనివార్యమే అయితే సిట్టింగు మార్పు తథ్యమా..? ఇలా అనేక ప్రశ్నలకు, సందేహాలకు ఆయన సర్వే ద్వారా నివృత్తి చేసుకుంటున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఓ సర్వే రిపోర్టు ఆయనకు చేరింది. మళ్లీ ఈ టీమ్‌ రంగంలోకి దిగింది. టికెట్‌ ప్రకటించిన తర్వాత అభ్యర్తులు చేసిందేమిటీ..? ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు..? రిసీవింగ్‌ ఎలా ఉంది..?? ఇలా ఎప్పటికప్పుడు జనాల, నాయకుల, కార్యకర్తల, ప్రతిపక్ష పార్టీల కదలికల పైన సర్వే టీమ్‌ రిపోర్టులు సేకరిస్తున్నది. ఒకవేళ కాంగ్రెస్‌ ఎవరిని ప్రకటించే అవకాశం ఉంది…? వారికున్న సానుకూలత అంశాలేమిటి..? బీజేపీ ఏ అభ్యర్థిపై ఫోకస్‌ పెట్టింది..? అతనికి ఉన్న బలమెంత..?? ఇలాంటి రిపోర్టు కూడా కేసీఆర్ చెంతకు చేరుతున్నది ఎప్పటికప్పుడు. సిట్టింగులు టికెట్‌ తీసుకుని సంబురపడగానే అయిపోలేదు. అసలు పండుగ ముందే ఉంది..అనే రీతిలో కేసీఆర్ చేపిస్తున్న సీక్రెట్‌ సర్వేలు సిట్టింగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది.

You missed