కేసీఆర్‌ అంతే. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఆయన అంతరంగం అంతుచిక్కదు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఆయన ఓడుతాడా..? నెవ్వర్. కానీ ఎందుకు కామారెడ్డిని రెండో ఆప్షన్‌గా ఎన్నుకున్నాడు. దీనిపై ఆయనకున్న లెక్కలు అనేకం. అవన్నీ రాజకీయం. అవి తెలియని వారే చాలా మంది. ఈ కామారెడ్డి అడ్డాగా ఆయన చేసే రాజకీయం పార్టీ అభ్యర్థులకు ఎంతో మేలు చేయనుంది. ముచ్చటగా మూడోసారి టికెట్లు తీసుకున్నా… ప్రజావ్యతిరేకత మాత్రం కూడగట్టుకున్నారనడంలో సందేహం లేదు.

సిట్టింగులకు తప్ప ఇతరులకు ఇచ్చే అవకాశం లేదు. రెండో క్యాడర్‌ లేకుండా చేసేశారు సిట్టింగులు. మరి ఎలా గెలవడం..? మళ్లీ మూడోసారి అధికారంలోకి రావడం ఎలా..? ముస్లింలు కాంగ్రెస్‌ వైపునకు చూస్తున్న తరుణంలో, ఉత్తర తెలంగాణలో బీజేపీ బలం కూడగట్టుకుంటున్న సమయంలో ఏం చేయాలి..? వీటన్నింటికీ ఒకే సమాధానం. కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయాలి. అదే జరుగుతున్నది. ఇక్కడ నుంచి ఆయన పోటీ చేస్తే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో అన్నీ క్లీన్‌ స్వీప్‌ అయిపోతాయి.

కొన్ని చోట్ల సిట్టింగులపై ప్రజా వ్యతిరేకత ఉంది.. కేసీఆర్‌ బహిరంగ సభలతో ఇక్కడ లోకల్‌గా ఆయన కనిపిచండంతో అదీ తుడిచిపెట్టుకుపోతుంది. అంటే మళ్లీ కేసీఆర్‌ ముఖమే చూస్తారు. ఆయన ప్రవేశపెట్టే మేనిఫెస్టోనే ఆకర్షిస్తుంది. అంతిమంగా బీఆరెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుస్తారు. ఇదీ కేసీఆర్‌ వ్యూహం. కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ ఓటమి ఇక ఖరారైపోయినట్టే. నిజామాబాద్‌ అర్బన్‌తో పాటు, బోధన్‌, అటు నిర్మల్‌ జిల్లాలోని కొన్ని నియోజవకర్గాల్లో ముస్లిం ఓట్లు ప్రభావశీలంగా ఉన్నాయి. వాస్తవంగా వీరు ఐతే ఎంఐఎం లేదా బీఆరెస్‌ వైపు ఉంటారు. కానీ ఇప్పుడు బీఆరెస్‌ వైపు అంతగా ఇంట్రస్టు చూపడం లేదు. దీన్ని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉంది. ఇది గ్రహించిన కేసీఆర్‌… గంప గుత్తగా ముస్లిం ఓట్లు ఎటూ చీలకుండా బీఆరెస్‌కే పడేలా ఎత్తుగడ వేశారు. అందులో భాగమే కామారెడ్డి. ఎమ్మెల్సీగా ఉన్న కవిత రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి పోటీ చేయడానికి సిద్దమయ్యారు. ఈమె గెలుపునకు కూడా ఈ క్లీన్ స్వీప్‌ వ్యూహం ఓ క్లియర్‌ రూట్‌ను చేసిపెడుతుంది. అటు మెదక్‌, ఇటు కరీంనగర్‌లలో కూడా కేసీఆర్ కామారెడ్డి కేంద్రంగా తన ప్రభావాన్ని చూపనున్నాడు. అందుకే కామారెడ్డిని అడ్డాగా మార్చుకున్నాడు.

You missed