అందరూ ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బీఆరెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రేపు (శ్రావణ సోమవారం) ప్రకటించేందుకు అధినేత, సీఎం కేసీఆర్ సిద్దమయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రేపు మంచి రోజు కావడంతో దాదాపు 85 శాతం మంది సిట్టింగులకే తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థుల చాన్స్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాలున్నాయి. వీరందరికీ మళ్లీ అవకాశం వచ్చే అవకాశం వందశాతం ఉంది. నిజామాబాద్ రూరల్‌, కామారెడ్డి నియోజకవర్గ విషయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రెండింటివి వేర్వేరు కారణాలు.. కానీ ఉత్కంఠ, ప్రచారం మాత్రం అభ్యర్థుల జాబితా విడుదలయ్యే వరకు కొనసాగేలా ఉంది.

నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు టికెట్‌ కన్ఫాం. కానీ.. బాజిరెడ్డి తన తనయుడు బాజిరెడ్డి తనయుడు బాజిరెడ్డి తనయుడికి ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా అధిష్టానాన్ని కోరినా..అప్పుడు సమీకరణలు కుదరలేదు. అధిష్టానం సూచన మేరకు తనే పోటీ చేశాడు బాజిరెడ్డి. కానీ ఈసారి తప్పకుండా తన కొడుకుకే చాన్స్‌ ఇస్తారనే నమ్మకంతో ఉన్నాడు. కేసీఆర్‌తో పాటు, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డిలతో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు బాజిరెడ్డి. ఇక ఫైనల్‌ డిషసన్ అధినేతకే వదిలేశాడు. కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్‌ పోటీ చేస్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది.

ఇక్కడ కేసీఆర్‌కు తన కుటుంబ మూలాలున్నాయి. అందుకే ఇక్కడ నుంచి తను పోటీ చేస్తే ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలపై కూడా ప్రభావం చూపి బీఆరెస్‌ అభ్యర్థులంతా గెలుపు తీరాలకు చేరుతారనే ఓ అంచనా ఉంది. కానీ కేసీఆర్‌ మనసులో మాట ఎవరూ చెప్పలేరు కదా.. దీంతో కామారెడ్డి విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూ వస్తోంది. ఒకవేళ కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌ వచ్చి పోటీ చేస్తానంటే తనకెంతో హ్యాపీ అంటూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ కూడా పలు మార్లు మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే.

సీఎం కేసీఆర్‌ కాకపోతే ఆ సీటు సిట్టింగుకే. అందులో అనుమానం లేదు. ఏది జరిగినా తన మంచికే అనుకుంటున్నాడు గంప గోవర్దన్‌. ఇక బాల్కొండ నుంచి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌ నుంచి ఆశన్నగారి జీవన్‌రెడ్డి, అర్బన్‌ నుంచి బిగాల గణేశ్‌ గుప్తా, బోధన్‌ నుంచి షకీల్, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి నల్లమడుగు సురేందర్‌, జుక్కల్‌ నుంచి హన్మంత్‌ షిండేలకు సీట్లు ఖరారైపోయాయి. రేపు ప్రకటనే తరువాయిగా మిగిలి ఉంది. ఒకవేళ సీఎం కేసీఆర్‌ రేపు (సోమవారం) అభ్యర్థుల ప్రకటన చేయని పక్షంలో.. చాలా చోట్ల సిట్టింగుల మార్పు ఉండనుందనే సంకేతం ఇచ్చినట్టుగా భావించవచ్చని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వాస్తవం ప్రతినిధితో చెప్పారు. దీంతో అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు సోషల్‌ మీడియాలో ఎవరికి తోచించి వారు రాసుకుంటూ పోవడంతో సిట్టుంగుల్లో కూడా అయోమయ పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. మాకే అంటూ మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే.. ఓ వైపు లోలోన తీవ్ర టెన్షన్‌కు గురవుతున్నారు సిట్టింగులు.

 

You missed