జర్నలిజంలో…
మూడు దశాబ్దాల ప్రయాణం!

ప్రశ్నించేతత్వమే నన్ను జర్నలిజం వైపు అడుగులు వేయించింది. ఈ రంగంలో అడుగిడి నేటితో ముప్పై ఏళ్లు (మూడు దశాబ్దాలు) పూర్తవుతోంది. సరిగ్గా జూన్ 2, 1993 న ‘ఉదయం’ దిన పత్రికలో మాచారెడ్డి మండల రిపోర్టర్ గా నా ప్రయాణం మొదలైంది. అప్పుడు రైతుల ఆత్మహత్యలు, మలేరియా మహమ్మారి, రాజ్యహింస … ఇలా ఎన్నో ముఖ్యమైన అంశాలపై రాసిన కథనాలు నాకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. నక్సలైట్ ఉద్యమాన్ని దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా, అప్పట్లో దళ కమాండర్ స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయి నాయకుడి వరకు చేసిన ఇంటర్వ్యూలతో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. తరువాత కామారెడ్డి నియోజక వర్గ ఇంచార్జీ గా పనిచేసినప్పుడు దేశ సరిహద్దులు దాటిన పెన్సిడిల్ సిరప్ రాకెట్ పై రాసిన కథనాలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ వార్తలు పుంఖాను పుంఖాలుగా రాసి ఉద్యమానికి ఉడత సాయం అందించాను.

కళాశాల ఆస్తుల వివాదం, కామారెడ్డి జిల్లా కావాలన్న ఆకాంక్ష పై ప్రత్యేక కథనాలు కూడా సంతోషాన్ని ఇచ్చాయి. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అయ్యాక మరింత అవగాహనతో ఎన్నో సామాజిక సమస్యలపై, పరిశోధనాత్మక, మానవీయ కథనాలు, అక్రమాలు, అన్యాయాలపై రాసిన కథనాలు కెరీర్ లో మరింత గుర్తింపు తెచ్చాయి. ఎన్నో సమస్యలపై, ఎందరో అభాగ్యుల ఆక్రందనలు, దీన స్థితులపై అలాగే అక్రమాలు, అన్యాయాలపై కథనాలు రాసి నా కలం ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేశానన్న సంతృప్తి అయితే మిగిలింది. ఆ స్థాయి గుర్తింపు కూడా లభించింది. నేను రాసిన వార్తల మూలంగా కొందరు ఇబ్బంది పడొచ్చు. కానీ ఎంతో మందికి మేలు చేశానన్న సంతృప్తి ఉంది.

ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో వార్తల వెంటపడి కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాను. మా అమ్మానాన్న, నా భార్య, పిల్లలు నావల్ల కొంత ఇబ్బంది పడ్డారు. తీర్థయాత్రలు, విహార యాత్రలకు ఏనాడూ తీసుకెళ్లలెకపొయాను. అయినా కుటుంబం నాకు ఎంతో సహకరించింది. ఫంక్షన్లకు వెళ్లేందుకు రెడీగా ఉండమని చెప్పి సమయానికి వెళ్లక వాళ్ళు వెళ్ళలేక నన్ను తిట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

నా ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో సహకరించిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. ముఖ్యంగా కెరీర్ ఎదుగుదలకు ప్రోత్సహించి, అండగా నిలిచిన పెద్దలకు రుణపడి ఉంటాను. ముందు ముందు మరింత సహకారం కోరుతూ…
మీ
శ్రేయోభిలాషి
ఎస్. వేణుగోపాల్ చారి (వేణు)
స్టాఫ్ రిపోర్టర్, సాక్షి
కా మా రె డ్డి.

You missed