డేగ కన్ను… అక్క సర్వే….

నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ కవిత టీమ్‌ సర్వే..

బీఆరెస్‌ సిట్టింగులపై వ్యతిరేకత ఎంత..? అనుకూలత ఎంత..?

ప్రత్యర్థుల బలమెంత..? గెలుపు తీరాలకు చేరేదెలా..?

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలవటమే ధ్యేయంగా కవిత పాలిట్రిక్స్‌…..

పోటీపై డౌటే… కంచుకోటలా పార్టీని కాపాడుకునే తల్లికోడి పాత్ర..

నిజామాబాద్‌ ప్రతినిధి- వాస్తవం:

ఎమ్మెల్సీ కవిత టీమ్‌ నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరధిలో సర్వే చేస్తోంది. ఇది ఇప్పటికే మొదలయ్యింది. ఈ సర్వే ఎన్నికలు ముగిసే వరకు ఎప్పటికప్పుడు మార్పులను గమనిస్తూ.. అధిష్టానికి సమాచారమిచ్చే వారధిగా పనిచేయనుంది. నిజామాబాద్‌ పార్లమెంటు పరధిలోని ఏడు నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కూడా బీఆరెస్‌ ఎమ్మెల్యేలే గెలిచే విధంగా కవిత యాక్టివ్‌ పాలిట్రిక్స్‌ ప్రయోగిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆమెకు ఇంకా నాలుగేళ్లకు పైగా కాల పరిమితి ఉంది. ఇప్పుడప్పుడే ఆమె పోటీ చేసేలా లేరు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి లేదా నిజామాబాద్‌ పార్లమెంటు నియోజవకర్గం ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నా.. కేసీఆర్‌ ఆమెను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించడానికి విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో ఆమెను బిజీ చేయనున్నారు. కేటీఆర్‌కు ఇక్కడ పట్టాభిషేకం చేసి తను జాతీయ రాజకీయాలకు వెల్లానుకుంటున్న తరుణంలో కవితను కూడా తన వెంటే తిప్పుకునే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో ఆమె లేని లోటు, కొరత పార్టీ అధిష్టానానికి కనిపిస్తోంది.

దీంతో ఆమె టీమ్‌తో ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నట్టు తెలిసింది. ఇంతకు ముందు కవిత .. ఎంపీ అర్వింద్‌ పై సవాల్‌ విసిరారు. తప్పుడు హామీలతో తనను ఓడించి గద్దెనెక్కిన అర్వింద్‌.. పసుపు రైతులను మోసం చేశాడని, ఎక్కడి నుంచి పోటీ చేసినా.. వెంటాడి, వేటాడి ఓడిస్తానని కూడా శపథం చేశారు. అయితే చాలా మంది ఆమె .. అర్వింద్‌పై పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆమె పోటీలో ఉండేలా లేరు. అర్విందే కాదు.. ప్రతిపక్ష పార్టీ గెలవకుండా నిజామాబాద్‌ పార్లమెంటు బరిలో, కామారెడ్డి జిల్లాలో అన్ని చోట్లా తమ పార్టీ నేతలే గెలిచేలా ఆమె వ్యూహం రచిస్తున్నారు.

దీనిలో భాగంగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వస్తున్నారు. సర్వే టీమ్‌ను రంగంలోకి దింపారు. సిట్టింగు ఎమ్మెల్యేలకు మళ్లీ ఛాన్స్‌ ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఎవరికి ప్రజల మద్దతు ఉంది..? ఎవరు ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు..? ప్రతిపక్ష పార్టీల బలమెంత..? అనే కీలక అంశాలపై ఈ సర్వే టీం నిరంతరం నిఘా పెట్టనుంది. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలు, సమీకరణలను అధిష్టానానికి చేరవేయనున్నారు. ఈ రిపోర్టు ఆధారంగానే సిట్టింగులను మార్చే అవకాశం కూడా లేకపోలేదు.

You missed