చాలా రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. వ‌చ్చేనెల 5న అంటే మ‌రో నాలుగు రోజుల్లో ఆయ‌న జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్‌, పార్టీ ఆఫీసును ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ చేసేందుకు ఎమ్మెల్యేలు, మంత్రి ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ‌లో నిమ‌గ్న‌మై ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇందూరు బీజేపీ ఓ కొత్త ఎత్తుగ‌డ వేసింది. ఎంపీ అర్వింద్ నేతృత్వంలో జిల్లాలో స‌భ ఏర్పాటు చేయాల‌ని భావించింది.

స‌రిగ్గా సీఎం స‌భ‌కు రెండు రోజుల ముందు .. అంటే సెప్టెంబ‌ర్ 3న జిల్లా క‌లెక్ట‌రేట్ గ్రౌండ్‌లో ఓ స‌భ‌ను పెట్టుకుంటామ‌ని ప‌ర్మిష‌న్ కోసం క‌లెక్ట‌ర్ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు క‌లెక్ట‌ర్‌. అయితే సీఎం స‌భ ముగిసే వ‌ర‌కు ఎవ్వ‌రికీ ఎలాంటి ప‌ర్మిష‌న్ ఉండ‌ద‌ని పోలీసులు చెప్పేశారు. అయినా ఇందూరు బీజేపీ కావాల‌ని, క‌య్యానికి కాలు దువ్వే త‌త్వంతో ముందుకు సాగుతోంది. ఎలాగూ స‌భ‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌రు. కానీ అదే సాకుతో త‌మ‌కు మాట్లాడేందుకు ఛాన్స్ దొరుకుతుంద‌ని భావిస్తోంది. టీఆరెస్‌ను ఇరుకున పెట్టేందుకు ఇదో ఎత్తుగ‌డ కింద చూస్తోంది. మ‌నుగోడులో కేంద్ర హోం శాఖ మంత్రి బ‌హిరంగ స‌భ‌కు ఒక్క‌రోజు ముందే సీఎం స‌భ‌కు ఎలా ప‌ర్మిష‌న్ ఇచ్చారు..? ఇక్క‌డ ఎందుకు ఇవ్వ‌రు..? అని ఇందూరు బీజేపీ ప్ర‌శ్నిస్తుంది.

అయితే ఇక్క‌డ బీజేపీ త‌ల‌పెట్టే స‌భ‌కు వాస్త‌వంగా ఓ రూపు, ప్లానింగ్ లేదు. పెద్ద‌లెవ్వ‌రికీ స‌మాచారం లేదు. అర్విందే అప్ప‌టిక‌ప్పుడు ఈ నిర్ణ‌యం తీసుకుని అలా ప‌ర్మిష‌న్ కోసం ద‌రఖాస్తు ప‌డిస్తే అది చ‌ర్చ‌లో భాగ‌మ‌వుతుంద‌నే ఆలోచ‌నే త‌ప్ప‌… నిజంగా మీటింగు పెట్టాల‌నే ఉద్దేశ్యం లేదు. ఒక‌వేళ స‌భ పెట్టాల‌నే ఆలోచ‌నే ఉంటే సీఎం స‌భ త‌ర్వాత పెట్టొచ్చు. కానీ ముందే పెట్టాల‌ని ప‌ర్మిష‌న్ అడ‌గ‌టం కయ్యానికి కాలు దువ్వే చ‌ర్య‌లో భాగ‌మే అనుకోవ‌చ్చు. ఎమ్మెల్సీ క‌విత‌పై ఢిల్లీ లిక్క‌ర్ స్కాం మ‌ర‌క అంటించే ప్ర‌య‌త్నంలో బీజేపీ హ‌డావుడి చేసింది. ఈ క్ర‌మంలో జిల్లాలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం స‌భ‌ను ఇందూరు టీఆరెస్ అందుకే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ది. దీనికి బీజేపీ ఢీ అంటే ఢీ అనే రీతిలో ఏదో ర‌కంగా టీఆరెస్‌కు కాళ్ల‌లో క‌ట్టెపెట్టినట్టు వ్య‌వ‌హ‌రిస్తూ రాజ‌కీయాలను మ‌రింత వేడెక్కిస్తున్న‌ది.

You missed