మరో నాలుగైదు రోజుల్లో సీపీఐ మహాసభలు నిర్వహించాలి ఆ జిల్లాలో. అంతకు ముందే నెల రోజుల నుంచి చందాల కోసం తిరుగుతున్నారు నేతలు. రాశారు చాలా మందే. ఇంకా డబ్బులు రాలేదు. వాటిని వసూలు చేయడానికి వెళ్లిన వారికి మాత్రం మంచి షాక్ ఇచ్చారా వ్యాపార, ఇతర వర్గాలు ఎందుకంటారా..?
సీపీఐ .. టీఆరెస్‌కు మునుగోడులో సపోర్టు చేయడం వారికి నచ్చలేదట. భవిష్యత్తులో కూడా ఇక టీఆరెస్‌తోనే సీపీఐ కలిసి నడవనుందనే సంకేతం కేసీఆర్ మొన్న మీటింగు వేదిక ఇచ్చాడు. దీంతో అందరికీ అవగతమైంది. రానున్న ఎన్నికల్లో సీపీఐ .. టీఆరెస్‌తో కలిసి పోటీ చేయనుందని. సీపీఎం ఇంకా కలిసి రాలేదు. వస్తదని ఆశిస్తున్నారు. వస్తదో రాదో తెలియదు కానీ.. సీపీఐ మాత్రం డిక్లేర్ చేసేసుకున్నది.
ఏమన్నా మీరు టీఆరెస్‌కు సపోర్టు చేస్తున్నరు కదా.. నేను రాసిన పదివేల చందా ఇవ్వడం లేదు. ఓ రెండు మూడు వేలు పట్టుకుపో అన్నాడట ఓ వ్యాపారి. అగో ఇదేందే అని అడిగితే అంతే మరి. అప్పడు రాసినప్పుడు మీరు ఎవరితో కలిసి లేరు. ఇప్పుడు టీఆరెస్‌తో ఉన్నారు మాకు నచ్చలేదు అన్నాడట.
చాలా చోట్ల ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయంట సీపీఐ నేతలకు. టీఆరెస్‌పై వ్యతిరేకత ఉన్నవాళ్లు.. తటస్తంగా ఉన్నవాళ్లు…. వీరిద్దరి కలయికను ఇష్టపడటం లేదన్నమాట….! ఈ విషయాన్ని ఆ నేతలు గ్రహించారు. గ్రహించీ చేసేదేముంది..? ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వారివి..