టీఆరెస్ అంతే. కేసీఆర్ ఆలోచ‌న‌లూ అంతే. ఒకొక‌ప్పుడు పాద‌రసంలా ప‌నిచేస్తాయి. మ‌రొక‌ప్పుడు త‌ప్ప‌ట‌డుగులు వేస్తాయి. కాంగ్రెస్‌ను ఖ‌తం చేసి బీజేపీ త‌ల‌నొప్పిని నెత్తికెత్తుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు దాన్ని నిలువ‌రించేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు. రాష్ట్రంలో బీజేపీ మ‌రింత బ‌లోపేతం కావ‌డానికి ఇతోధికంగా టీఆరెస్సే స‌హాయ‌ప‌డుతుంద‌నే అభిప్రాయాలు ఆ పార్టీ వ‌ర్గాల నుంచే రావ‌డం గ‌మ‌నార్హం. జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా అలాగే ఉన్నాయి మ‌రి. రాజాసింగ్ వ్య‌వ‌హారంలో టీఆరెస్ స‌క్సెస్ అయ్యింది. బీజేపీ హై క‌మాండ్ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింది. రాజాసింగ్ మ‌త‌విధ్వేషాలు రెచ్చ‌గొట్టే విష‌యంలో ప‌లుమార్లు హైకమాండ్ హెచ్చ‌రిక‌లు జారీ చేసినా ప‌ట్టించుకోలేదు. దిద్దుబాటు చ‌ర్య‌లో భాగంగా స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

అంత‌కు ముందే టీఆరెస్ ప్ర‌భుత్వం రాజాసింగ్‌ను అరెస్టు చేయ‌డాన్ని మోజార్టీ ప్ర‌జ‌లు స‌మ‌ర్థించారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. దీన్ని టీఆరెస్ ఓన్ చేసుకోలేక‌పోయింది. రాజ‌కీయంగా వాడుకోలేక‌పోయింది. ఈ అంశాన్ని వ‌దిలేసి.. గాలికిపోయే కంప‌ను నెత్తికెత్తుకున్న‌ట్టు… మ‌రొక రోజు ఓపిక ప‌డితే పూర్త‌యిపోయే బండి సంజ‌య్ పాద‌యాత్ర‌పై ప‌డింది టీఆరెస్ అన‌వ‌స‌రంగా. ఆ పాద‌యాత్ర‌కు అంతంత‌మాత్రంగానే స్పంద‌న వ‌స్తుంది. కానీ టీఆరెస్ ఏమో అనుకున్న‌ది. అరెస్టు చేసి పాడేసింది బండిని. ఇంత‌టితో ఆగిందా..? హైకోర్టుకు కూడా పోయింది. ఈ పాద‌యాత్ర వ‌ల్ల శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంది. దీనిపై హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు టీఆరెస్‌కు చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. బండి సంజ‌య్ పాద‌యాత్ర చేసుకోవ‌చ్చ‌ని హై కోర్టు ఆదేశం ఇవ్వ‌డంతో బండి సంజ‌య్ ఛాతి విరుచుకుని న‌డిచేలా చేసింది. అస‌లే స్పంద‌న లేని సంజ‌య్ పాద‌యాత్ర‌ను అన‌వ‌స‌రంగా టీఆరెస్సే ఎక్కువ స్పేస్ ఇచ్చి.. ఏదో ఊహించుకుని.. బండిని హీరో చేయ‌డం త‌ప్ప టీఆరెస్ సాధించిందేమీ లేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలే అనుకుంటున్నాయి.

You missed