కరోనా ఎంటరైంది అప్పుడే. కొత్తగా ఎడిటర్‌గా కృష్ణమూర్తి ఎంటరైందీ అప్పుడే. ఆ క్షణం నుంచి ఉద్యోగులకు పీడదినాలు మొదలయ్యాయి. శని దాపురించింది. దరిద్రం నెత్తికెక్కి కూర్చుంది. కృ.తి నిర్ణయాలకు వందలాది మంది ఉద్యోగులు రోడ్డు పాలయ్యారు. దిక్కుతోచని ఆ దైన్య స్థితిలో కర్కశంగా ఆ ఎడిటర్ తీసుకున్న నిర్ణయాలు చాలా మంది కుటుంబాలను వీధిన పడేశాయి. ఆ ఉద్యోగులను తగ్గించేసి తను వచ్చిన ఆంధ్రజ్యోతి టీమ్‌ను దించాడు. వారికి జీతాలు ఆమాంతం పెంచాడు. ఉన్న ఉద్యోగుల జీవితాలను ఊచ కోత కోసిన తర్వాత అది ఆదాయం కింద చూపి తన అనుచరులకు, కొత్తగా వచ్చిన టీమ్‌కు జీతాలు పెంచేసుకుని అప్పటి వరకు పనిచేస్తున్న వారిని మాత్రం దొంగలుగా, పని దొంగలుగా, ఫైరవీకారులుగా చిత్రీకరించాడు.
అప్పటి వరకు ఆత్మగౌరవ పోరాటంతో మేమూ ఉన్నామని, ఉద్యమ చరిత్రలో మేమూ ఉంటామని కలలు కన్న ఆ ఉద్యోగులకు ఆ సంస్థలోనే ఆత్మగౌరవం లేకుండా పోయింది. వేరే దారి లేక, కరోనా వేళ ఉద్యోగాల్లేక, ఉపాధి కరువై… కృ.తి ఆగడాలను భరిస్తూ బిక్కు బిక్కు మంటూ భయంగా బతకడం నేర్చుకున్నారు. ఆత్మగౌరవం మాటెత్తితే తినేందుకు తిండి దొరకడమే కష్టమనే భావనలో భయంగా బతుకులీడ్చారు. మూండేడ్లు దాటింది. జీతాలు పెరగలేదు. ఇంక్రిమెంట్లు లేవు. తిక్కరేగింది. మహబూబ్‌నగర్ నుంచి నిరసన సెగ రాజుకుంది. పెన్ డౌన్ చేశారు. మేనేజ్‌మెంట్ కాళ్ల బేరానికి వచ్చింది. ఈ అగ్గి ఇప్పుడు రాష్ట్రమంతా రాజుకుంది. అన్ని ఎడిషన్ సెంటర్లకూ సెగ తాకింది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. మనమూ ఉన్నాం ఎందుకు…? వాళ్లు నయం.. తెగించి ఆందోళన చేశారు… ఇక లాభం లేదు. తాడోపేడో తేల్చుకోవాల్సిందే… అనే నిర్ణయానికి వచ్చారు.
ఇటీవల జీతాల కోసం మంత్రి కేటీఆర్ వద్దకు ఎడిటర్ టీం వెళ్లిందట. కనీసం వారు చెప్పే మాటలు కూడా ఆయన వినలేదట. అలా ఫోన్ చూస్తూ కూర్చున్నాడట. పరిస్థితి చూసి అక్కడి నుంచి జారుకున్నారంట వాళ్లంతా. ఇదీ నమస్తే తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి. వారి జీతాల పెరుగుదల స్థితి. వారి జీవితాల దుస్థితి.
