ఎమ్మెల్సీ క‌విత‌. నిజామాబాద్‌కు పెద్ద దిక్కు. అంద‌రికీ త‌ల‌లో నాలుక‌. కానీ అది ఒక‌ప్పుడు. ఇప్పుడు సీన్ మారింది. నిజామాబాద్ ఎంపీగా ధ‌ర్మ‌పురి అర్వింద్ గెలిచిన త‌ర్వాత ప‌రిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతూ వ‌చ్చాయి. స్థానిక లీడ‌ర్ల అస‌మ‌ర్థత, లోపాలు బీజేపీకి క‌లిసి వ‌చ్చాయి. త‌ను ఓడిపోయిన త‌ర్వాత చాలాకాలం వ‌ర‌కు క‌విత కినుక వ‌హించింది. నిజామాబాద్ వైపు రావ‌డ‌మే చాలా త‌గ్గించింది. ఇది పార్టీ శ్రేణుల‌కు తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. లోక‌ల్ లీడ‌ర్ల ఇష్టారాజ్యం, ప‌ట్టింపులేని త‌నంతో విసిగి వేసారిన పార్టీ క్యాడ‌ర్ క‌విత వైపు చూశారు. కానీ ఆమె ఎవ‌రితో క‌లివిడిగా లేదు. అంద‌రితో అంటీ ముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించింది. దీంతో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. క‌విత‌కు మ‌ళ్లీ ఎమ్మెల్సీ ఇచ్చినా… ఆమె పెద్ద‌గా సంతృప్తిగా లేదు. మంత్రి ప‌ద‌వి వస్తుంద‌ని అంతా భావించారు. కానీ రాష్ట్రంలో పొలిటిక‌ల్ సినారియో మారిపోయింది. ప‌ద‌వి వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. క‌విత నిజామాబాద్ రాజ‌కీయాల‌కు దూరం దూరంగానే ఉంటూ వ‌చ్చింది. జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి ని నియ‌మించింది పార్టీ అధిష్టానం. కానీ పార్టీలో పెద్ద‌గా క‌ద‌లిక లేదు. ఆయ‌న నియామ‌కంపై పార్టీలోనే అసంతృప్తి వ్య‌క్త‌మ‌య్యింది. ఈ క్ర‌మంలో అర్వింద్ దూకుడు పెంచుతూ పోతున్నాడు.

పార్టీ ప‌రిస్థితిపై ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తూ వస్తున్న క‌విత స‌మ‌యం కోసం వేచి చూసింది. మూడేండ్ల త‌ర్వాత మౌనం వీడింది. బుధ‌వారం చాలా రోజుల త‌ర్వాత నిజామాబాద్‌కు వ‌చ్చింది. ప్రెస్‌మీట్ పెట్టింది. అర్వింద్ పై ఏకంగా దండ‌యాత్రే చేసింది. ప‌సుపు బోర్డు బూట‌క‌పు హామీ నుంచి మొద‌లు పెట్టి …. ఇప్ప‌టి వ‌ర‌కు ఏం ఒర‌గ‌బెట్టావో చెప్పు అని నిల‌దీసింది. తాను ప‌సుపు రైతుల సంక్షేమం కోసం చేసిన ప‌నులు..ప‌సుపు బోర్డు ఏర్పాటు కోసం కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగిన వైనాన్ని సోదాహ‌ర‌ణ‌గా మీడియా ముందుంచింది. ఎన్నిక‌ల వేళ త‌ప్పుడు హామీలిచ్చిన అర్వింద్ మాట‌లు.. ఆ త‌ర్వాత దాట‌వేత దోర‌ణి ని వీడియోల ద్వారా మీడియాకు వివ‌రించి ఉతికి ఆరేసింది. ప్ర‌జ‌లు అంతా గ‌మ‌నిస్తున్నార‌ని, ఇక ఊరుకునేది లేద‌ని, ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీత‌లుంటాయ‌ని వార్నింగ్ ఇచ్చింది. జిల్లా పార్టీ శ్రేణుల‌కు ఈ ప‌రిణామం ఉత్సాహాన్నిచ్చింది. చాలా రోజుల త‌ర్వాత త‌మ అధినేత్రి జిల్లాపై ప‌ట్టు సాధించేందుకు, పూర్వ వైభ‌వం కోసం న‌డుం బిగించిన తీరుకు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లైన పొలిటిక‌ల్ వార్ ఇక ఇందూరు వేదిక‌గా ముద‌ర‌బోతోంది. మాట‌ల యుద్దాలు, ప్ర‌త్య‌క్ష, ప‌రోక్ష వార్నింగుల‌తో జిల్లా రాజ‌కీయాలు హాట్ టాపిక్‌గా మార‌నున్నాయి. ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న సంద‌ర్భంలో ఇందూరులో పొలిటిక‌ల్ హీట్ … భానుడి భ‌గ‌భ‌గ‌ల‌తో పోటీ ప‌డుతున్న‌ది.