టీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికలు ఖాయమనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మళ్లీ గెలుపు గుర్రాల అంశాన్ని కేసీఆర్ కీలకంగా తీసుకున్నారు. రెండోసారి సిట్టింగులకే అవకాశం ఇచ్చినా.. మూడో సారి చాలా మందికి అవకాశం ఇచ్చేలా లేడు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో మెజారిటీ ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో టికెట్లు కోత పెట్టేందుకు కేసీఆర్ రంగం రెడీ చేసుకున్నారు. ఇప్పటికే సీక్రెట్‌గా సర్వేలు కూడా చేపించుకుని పెట్టుకున్నాడనే ప్రచారం ఉంది. తాజాగా టీఆరెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం వివాదస్పదమయింది. చర్చకు దారి తీసింది. మెజారిటీగా ఎమ్మెల్యేలకే అవకాశం కల్పించారు. కొందరు ఎమ్మెల్సీలున్నారు. ఒకరు ఎంపీ.
ఎమ్మెల్యేలుగా ఉన్న సిట్టింగులకు జిల్లా పార్టీ పగ్గాలివ్వడం వెనుక అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతున్నది. రానున్న ఎన్నికల్లో వీరి టికెట్లకు కోత పడనుందని, జిల్లా అధ్యక్ష హోదాలో అన్ని నియోజకవర్గాల గెలుపును మీ భుజస్కంధాలపై పెట్టామనే పెద్ద మనిషి తరహా బాధ్యతను నెత్తికెత్తి టికెట్లను కోత కోసి.. వేరొకరి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. అధికార పార్టీలో కూడా ఇదే విషయం చర్చించుకుంటున్నారు.
http://TRS Party District Presidents List
వ్యూహం ఏదైనా… ఎమ్మెల్యేలకు జిల్లా పార్టీ పగ్గాలివ్వడం చాలా చోట్ల అసంతృప్తికి దారి తీసింది. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకుపోయే పరిస్థితి మెజారిటీ ప్లేసుల్లో లేదు. కొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఇంకొందరు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే వ్యూహంలో భాగంగా కొందరి టికెట్ల కోతకు ఇలా పార్టీ పగ్గాలప్పగించే కార్యక్రమాన్ని చేపట్టిన అధష్టానం… దీని వల్ల పార్టీకి మరింత నష్టం జరిగి, ప్రతిపక్షాలకు బలం చేకూరే అంశాన్ని మాత్రం విస్మరించిందనే చెప్పాలి.