ఈ నెల పదవ తారీఖుతో రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 50వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోచేరనున్నాయి. ఈ సందర్బంగా ఆ వేడుక.. ఓ పండుగ.. ఓ సంబురం నిర్వహించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చాడు పార్టీ శ్రేణులకు. కరెక్టు సందర్బం. మంచి ఆలోచన. రైతు బంధు ద్వారా రైతులు కానీ భూస్వాములు అప్పనంగా లక్షలకు లక్షలు మింగుతున్నారు. కనీసం ఆ డబ్బులు మాకొద్దు అని వాపస్ కూడా ఇచ్చే పెద్ద మనసు, సెన్స్ వాళ్లకు లేదు. ఇందులో ఎమ్మెల్యేలు, మంత్రులూ ఉన్నారు. ఎవరూ మినహాయింపు కాదు.
సరే, అది వేరే ముచ్చట. కానీ ఈ రైతు బందు పథకం సన్న,చిన్నకారు రైతులకు వరమే. అవసరానికి ఆదుకునే కల్ప తరువే. కష్టాల్లో ఖర్చులకు పనికి వచ్చే పైకమే. కాదనలేం. చాలా మంది రైతులు తమకు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయా..? తమ సెల్ ఫోన్కు మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఈ పథకం ప్రభావం అలా ఉంది. మంచి ఆలోచనే. భూమి ఉన్న ప్రతీ వాడికీ రైతుబంధు ఇవ్వాలి.. కౌలు రైతును పట్టించుకోవద్దు అనేది పక్కా పొలిటికల్ స్ట్రాటజీ.
కేసీఆర్ దళితబంధు పథకం విషయంలో ఓ సందర్బంలో అన్నట్టు.. మాకు ఓట్లు అవసరం లేదా .. అవును. ఈ పథకం విషయంలో కూడా టీఆరెస్ ఓట్లను ఆర్జిస్తున్నది. ఓట్లు రావాలని కోరుకుంటున్నది. తప్పేం లేదు. పొలిటికల్ పార్టీగా దానికది అవసరం. ఇవన్నీ పాత ముచ్చట్లే. కానీ ఇప్పుడు మనం కొత్త విషయం చర్చించుకోబోతున్నాం. అదేంటంటే… రైతుబంధు పథకం ప్రారంభించిన తర్వాత దాదాపు నాలుగేళ్ల తర్వాత యాభైవేల కోట్ల మైలు రాయికి చేరుకున్న తర్వాత ఈ సందర్భంలోనే ఈ సమయంలోనే ఈ పరిస్థితుల్లోనే ఓ వేడుక చేసుకోవాలనే ఆలోచన రావడం. అది కేసీఆర్దా..? కేటీఆర్దా తెలియదు.
కానీ కేటీఆర్ పిలుపునిచ్చాడు. రేపటి నుంచి వారం రోజులు.. వరుసగా జిల్లాల్లో మండలాల వారీగా, గ్రామాల వారీగా రైతులతో కలసి టీఆరెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటారు. రైతుబంధు కీర్తిని నలుదిశలా చాటే ప్రయత్నం. ఓ వైపు యాసంగిలో వరి వేయొద్దన్న ప్రభుత్వం పై రైతులు గుర్రుగానే ఉన్నారు. కేసీఆర్ కూడా ఈ విషయంలో ఏం చేయలని పరిస్థితి. కేంద్రం అలాంటి విపత్కర పరిస్థితులు క్రియేట్ చేసి పెట్టింది మరి. రాష్ట్రాన్ని రైతుల వద్ద విలన్గా నిలబెట్టే ప్రయత్నమే ఇది.
మరి ఈ ఎత్తుగడను ఎలా ఎదుర్కోవాలి. ఇగో ఇదే ఇప్పడు అందివచ్చిన అవకాశం. రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వంగా, వారి సంక్షేమాన్ని అహర్నిశలూ ఆశించే సీఎంగా రైతుబంధు ఎంత సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నామో చెప్పే ప్రయత్నం ఇది. బాగానే ఉంది. యాసంగిలో మరి రైతులు వరిపైపే మొగ్గు చూపుతున్నారు. నాట్లు కూడా జోరుగా పడుతున్నాయి. దాదాపు 20 శాతం వరకే వరి ఈ సీజన్లో తగ్గేలా ఉంది. మిగిలిన 80 శాతం పంట పండితే ఆ ధాన్యం ఎవరు కొంటారు…? మిల్లర్లు చేతులెత్తేస్తే రైతుల పరిస్థితి ఏందీ..? అప్పుడు ప్రభత్వం వద్దకే వచ్చి పడుతుంది ఈ సమస్య. కేసీఆర్ అప్పుడు ఏం చేస్తాడు..? మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నామా..? లేదు. పరిస్తితి తీవ్రత అలా ఉంది. ముందున్నది అదే సవాలు సర్కారుకు.