వాస్తవం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌:

ఎమ్మెల్సీ క‌విత బీఆరెస్ పార్టీపై , ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ఇటీవ‌ల జ‌రిగిన తాజా ప‌రిణామాల‌పై ఆమె ప‌రోక్షంగా కేటీఆర్‌నుద్ధేశించి ప్ర‌స్తావిస్తూ, కుట్రదారుడిగా, క‌క్ష‌సాధింపు రాజ‌కీయాల్లో భాగంగా ఆమెను వేధింపుల‌కు గురిచేస్తున్న అంశాన్ని నేరుగా జ‌నాల ముందు త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించారు. పార్టీ మేలు కోరి ప్ర‌శ్నిస్తే త‌న‌పై ఇంత‌టి కుట్ర‌నా..? ఇంత క‌క్ష‌సాధింపా..? ఇటీవ‌ల పార్టీలో త‌న‌పై ఏం జ‌రుగుతున్న‌దో మీ అంద‌రికీ తెలుసు…! అంటూ త‌న కొంత కాలంగా ఎదుర్కొంటున్న మాన‌సిక క్షోభ‌ను ఆమె త‌న లేఖ ద్వారా బ‌హిర్గ‌తం చేశారు. ఇది బొగ్గు గ‌ని కార్మికుల‌నుద్దేశించి రాసినా.. మొత్తం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆమె మానసిక వేద‌నను వివ‌రించిన‌ట్టుగానే ఉంది. పార్టీ నుంచి త‌న‌ను బ‌హిష్క‌రించే చ‌ర్య‌లు ఎలా కొన‌సాగుతున్నాయో తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారామె. త‌ను చేసిన నేర‌మేమిటీ..? అని కూడా ఆమె ఈ లేఖ ద్వారా పార్టీని, కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు. రాజ‌కీయంగా త‌న‌ను ఒంట‌రి చేయ‌డంలో భాగంగా ఇదంతా ఓ ప్లానింగ్ ప్ర‌కార‌మే చేస్తున్నార‌ని స్ప‌ష్టం చేసిన ఆమె.. ఎంత మానసిక వేద‌న‌కు గురిచేసినా.. వెన‌క్కి త‌గ్గేదే లేద‌నే సంకేతాలిచ్చారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా…

 

తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి వ్రాయునది…

అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లెరా…

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదేళ్లకాలంలో టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను. బుధవారం హైదరాబాద్‌ లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ కొప్పుల ఈశ్వర్‌ గారికి శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్‌ లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోన్నది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు నేను మొదటి నుంచి ముందు వరుసలో ఉండి పని చేశాను. 2015 ఆగస్టు 17వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజీకేఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో 11 ఏరియాల నుంచి హాజరైన 1000 మందికి పైగా సభ్యుల సమక్షంలో నన్ను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అప్పటి టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డితో పాటు సీనియర్‌ నాయకుడు కెంగెర్ల మల్లయ్య సహా అందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్‌ లో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలో నేనే తీసుకునేలా తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నేను పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు పన్నుతున్నారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే సంస్థలో డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే గౌరవ కేసీఆర్‌ గారిని ఒప్పించి తిరిగి డిపెండెంట్‌ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్దరించేలా చేశాను. తద్వారా సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సకల జనుల సమ్మెతో సింగరేణిలో తట్టాచెమ్మాస్‌ బంద్‌ పెట్టి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసేలా కృషి చేసిన మన కార్మికులకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇప్పించాను. కార్మికులు తీసుకునే రూ.10 లక్షలకు పైబడిన హౌసింగ్‌ లోన్‌ పై వడ్డీ చెల్లింపు, కార్మికులు నివసించే క్వార్టర్స్‌ కు ఉచిత కరెంట్‌, ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించాను. కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంట్‌ పది రెట్లు పెంచేందుకు పాటు పడినాను. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఫీ రీయింబర్స్‌ మెంట్‌ సదుపాయం తీసుకువచ్చాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారి జయంతి రోజున పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయించాను. సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు ఆప్షనల్‌ సెలవు మంజూరు చేయించాను. కార్మిక కుటుంబానికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్‌ వైద్యాన్ని వారి తల్లిదండ్రులకు కల్పింపజేశాను. క్యాడర్‌ స్కీం, మరణించిన లేదా మెడికల్‌ అన్‌ ఫిట్‌ అయిన కార్మిక కుటుంబాల్లోని వారసులు మేజర్‌ అయ్యేంత వరకు ఎంఎంసీ సదుపాయం కల్పించడం సహా కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్నో పథకాలు అమలు చేయడంలో క్రియాశీలంగా పని చేశాను.

MLC KAVITHA Letter

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో కొన్నాళ్లుగా జరుగుతోన్న పరిణామాలు మీకందరికి తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్‌ గారి ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను లేఖ రూపంలో తెలియజేశాను. నా తండ్రిగారైన కేసీఆర్‌ గారికి నేను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను. నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కేసీఆర్‌ గారికి రాసిన ఆ లేఖను లీక్‌ చేశారు. ఆ లేఖను లీక్‌ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని నేను కోరాను. పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నాపై కక్షగట్టారు. ఆ తర్వాత జరుగుతోన్న పరిణామాలు, ఘటనలు అన్ని మీ మననంలో ఉన్నాయనే అనుకుంటున్నాను. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్‌ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్షగట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు.

టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎళ్లవేళలా నేను మీ వెన్నంటే ఉంటాను. గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా, అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలందించానో ఇకపైనా కార్మికుల కోసం అలాగే పని చేస్తాను. కార్మికులకు ఏ చిన్నకష్టం వచ్చినా మీకు అండదండగా ఉంటాననని మాట ఇస్తున్నాను.

ధన్యవాదములతో…

మీ కల్వకుంట్ల కవిత