ఈసారి లోకల్ బాడీ ఎన్నికల పోటీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ తప్పుకుంటున్నాయి. బల పరీక్షకు కూడా కనీసం దరిదాపుల్లో లేనప్పుడు అనవసరంగా పోటీకి దిగి మరింత బలహీన పడటం ఎందుకనే అభిప్రాయంతో ఈ ఇరుపార్టీలున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి కవితకు అధిష్టానం అవకాశం ఇచ్చింది. రేపు ఉదయం 10.30 గంటలకు ఆమె మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ రెండు పార్టీలు ఎన్నికలకూ దూరంగా ఉండటంతో కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడమే మిగిలి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 12 స్థానాలకు గాను 12 టీఆర్ఎస్ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకోనుంది. నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే.. మొత్తం ఉమ్మడి జిల్లాలో 820 ఓట్లున్నాయి. ఇందులో కాంగ్రెస్‌కు 44, బీజేపీకి 54 ఉన్నాయి. ఈ ఇద్దరివి కలిసినా వంద కూడా సరిగ్గా లేవు. మిగిలిన 720 బలం టీఆరెస్‌కు ఉంది. కనీసం పోటీకి దరిదాపుల్లోకి కూడా ఇవి రావు.
అలాంటప్పుడు పోటీ చేసి … టీఆరెస్ లోకల్ బాడీ లీడర్లకు తాయిలాలు ఇప్పించేందుకు దోహపడటంతో పాటు ఉన్న పార్టీ నేతలు జంప్ కాకుండా వారికి ఖర్చు పెట్టి కాపాడుకోవడం అవసరమా..? ఎక్కువ డబ్బులిస్తామంటే టీఆరెస్‌లోకి జంప్ అయితే ఉన్న ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు..? అని ఈ రెండు పార్టీలు ఆలోచిస్తున్నాయి. దీంతో పోటీకి రాం రాం అంటున్నాయి.దీంతో కవిత ఎన్నిక ఏకగ్రీవమే కానుంది. అయితే అంతకుముందు కవిత పోటీ చేసేటప్పుడు విపరీతమైన ఖర్చు పెట్టారు.
ఒక్కొక్కరికి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఇచ్చారు. 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల పనులకు సంబంధించిన ప్రొసీడింగులిచ్చారు. వీటికి అలవాటు పడిన ఈ లీడర్ ఓటర్లు .. కవిత పోటీ చేస్తుందనగానే ఎగిరి గంతేశారు. మళ్లీ తాయిలాల పేర కాసుల పంట పండుతుందని సంబర పడ్డారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ లు పోటీకి దూరంగా ఉండటంతో ఉసూరుమంటున్నారు. ఎలాగైనా అరుదుగా వచ్చే ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దని పథకం వేస్తున్నారు. ఎవరితోనైనా ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయించాలనే ఎత్తుగడకు కూడా ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఏకగ్రీవం కాకుంటే బాగుండునని వేడుకుంటున్నారు తాయిలాలకు మరిగిన ఈ ఓటర్లు. అయితే ఎలాగూ ఖర్చు పెట్టేందుకు వెనుకాడని అధికార పార్టీ.. ఏకగ్రీవమైనా ఎవరికి ముట్టాల్సినవి వారికి ముట్టజెప్పుతుందనే ఆశలో పల్లకిలో కూడా కొందరు ఊరేగుతున్నారు.