ఓ వైపు వరి వేయొద్దంటూ ప్రభుత్వం నెత్తినోరు కొట్టుకుంటుంది. మహాధర్నాల పేరుతో అధికార యంత్రాంగమంతా రోడ్డెక్కుతున్నది. కానీ బీజేపీ మాత్రం కేసీఆర్‌ను వదలడం లేదు. అప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు..? ఇప్పుడేం చెబుతున్నాడు..? ఈ రెండు నాల్కల దోరణి ఏంటీ కేసీఆర్..? రైతులు ఏ మాట నమ్మాలి. అని ఈ రెండు వీడియోలు కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ పరిణామం రైతుల్లో మరింత అయోమయం, గందరగోళానికి గురి చేస్తున్నది.
ఇప్పుడు ఉన్నపళంగా వరి వేయకుండా వేరే పంటలు వేయాలంటే శాస్త్రీయంగా, టెక్నికల్‌గా కుదరని పని. మరి వరి వస్తే ఎవరు కొంటారు..? అని తల్లడమల్లడమవుతున్న రైతాంగానికి ఈ వీడియో మరింత అయోమయానికి గురి చేస్తుండగా, కేసీఆర్ మాటలపై అపనమ్మకం ఏర్పడేలా చేస్తున్నది. యాసంగి సీజన్ దగ్గర పడుతున్నది. ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రత్యామ్నాయ పంటలు ఇవి ఇవి వేసుకోండని ఓ బ్రోచర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నది. ఇక మీ చావు మీరు చావండి అన్నట్టుగానే ఉంది సర్కార్ వారి వ్యవహారం. ఇప్పుడు రైతుకొచ్చింది అ(వ)రి గోస.