రాష్ట్ర రాజ‌కీయాలు మారిపోయాయి. బంగారు తెలంగాణ నిర్మాత‌లు ఇప్పుడు బ‌ద్‌లా తీర్చుకునే ప‌నిని నెత్తుకున్నారు. అదే ప‌నిలో ఇక బిజీగా ఉండ‌నున్నారు. మొన్న‌టి దాకా ఓపిక ప‌ట్టారు. ఇక ప‌ట్ట‌రు. ఓపిక న‌శించింది. ఇక రంగంలోకి దిగారు. ఈట్ కా జ‌వాబ్ పత్త‌ర్ సే ఇచ్చేందుకు రెడీగా ఉండ‌మ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చాడు యువ‌రాజు కేటీఆర్‌. సోష‌ల్ మీడియాలో ఇక వీరికి ఇదే ప‌ని. ఎవ‌రేమ‌న్నారు..? దానికి ఎలా స‌మాధాన‌మివ్వాలె… దాన్ని ఎలా తిప్పి కొట్టాలె. ఘాటుగా కౌంట‌ర్ ఎలా ఇవ్వాలె. ఎలా సంక‌లు గుద్దుకోవాలె .. అనే దానికి ప్ర‌యార్టీ ఉంటుంది.

ప్ర‌తిప‌క్షాలు గొంతు పెంచాయి. బూతుల‌కు తెగ‌బ‌డ్డాయి. వీళ్ల‌ను నియంత్రించేందుకు మాదీ అదే దారి అంటు గొంతు చించుకునే ప‌నికి శ్రీ‌కారం చుట్టింది అధికార పార్టీ. అందుకే మొన్న‌టి వ‌ర‌కు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఇటుక‌లు పేర్చే ప‌నిలో బిజీ బిజీగా ఉన్న‌ట్టు క‌నిపించిన టీఆరెస్ ఇప్ప‌డు ఒక్క‌సారిగా ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే.. అని రాళ్లందుకుని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే ప‌నికి అంకురార్ప‌ణ చేసింది. కేసీఆర్ దీనికి మ‌రింత ఆజ్యం పోశాడు.

నాలుక చీరుస్తా.. ఆరు తుక్‌డ‌ల్ అయిత‌వ్ నా కొడుక‌… ఇప్ప‌టి దాకా ఊకున్నం.. ఇగ ఊకునేది లేదు.. అని గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అంత‌కు ముందు కూడా కేటీఆర్ ఇలాగే మాట్లాడినా పెద్ద‌గా స్పంద‌న రాలేదు. మొన్న‌టి హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట‌మితో నేల‌కు దిగివ‌చ్చిన కేసీఆర్ ఫ్ర‌స్టేష‌న్ అంతా బీజేపీపై చూపించాడు. వ‌రి ఇష్యూ ను కేంద్రంగా చేసుకుని కేంద్రం మీద విరుచుకు పడుతూనే బీజేపీ బండి సంజ‌య్ పుంగి బజాయించిండు. ఒక రోజు కాదు.. రెండు రోజులు వ‌రుస‌గా. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పడేలా. సీఎం చ‌ర్య‌ల‌కు విస్తుపోయేలా.

దీన్ని స‌మర్థిస్తూ నిన్న కేటీఆర్ కామారెడ్డిలో సీఎం అయ్యాడ‌ని సాఫ్ట్ గా ఉన్నాడ‌నుకున్నారేమో… లోప‌ల ఒరిజిన‌ల్ అలాగే ఉంద‌ని ఓ సినిమా డైలాగ్ కొట్టాడు. ఇదీ నేటి రాజ‌కీయం. మూడు ఒక‌టంటే మేం మూడంటాం.. మీరు ఒక‌టి కొడితే మేం నాలుగు తంతాం.. మీరు కుక్క‌ల్లా మొరుగుతున్నారంటూనే.. మేం మీక‌న్నా ఎక్కువ‌గా మొర‌గ‌డానికి కూడా వెన‌కాడం అంటున్నారు బంగారు తెలంగాణ భావి నిర్మాత‌లు.

You missed