తెలంగాణ రాష్ట్రంలో ఇంక సమస్యలెక్కడివి..? ఆందోళనలెందుకు? ధర్నాలు అవసరమా..? దీక్షల పేరుతో డ్రామాలు ఇంకానా..? కొట్లాది ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ ధర్నా చౌక్ మీద పగబట్టాడు. ఎవడు బడితే ఆడు ఈడికి రావాలె. టెంట్ ఎయ్యాలె. ముర్దాబాద్లు కట్టాలె.. సర్కార్ కాళ్లల్ల కట్టెలువెట్టాలె.. ఛస్.. ఇదేందివియా.. గా ధర్నా చౌక్ ను పీకి పాడేయ్యుర్రి.. చిరాకు దొబ్బుతుంది అని ఆర్డేరేశాడు కేసీఆర్.
అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇదేందీ..? తెలంగాణ తెచ్చుకుంది.. ధర్నాలు, దీక్షలు చేసి కాదా..? ఉద్యమాల ద్వారా కాదా..? ఇప్పుడు ప్రజల గొంతుక నొక్కేస్తారా? ఉద్యమాల మాటే లేకుండా చేస్తారా? ప్రశ్నించే పరిస్థితే లేదా..? అని తిరగబడ్డారు. మండిపడ్డారు. కేసీఆర్ వైఖరిపై విరుచుకుపడ్డారు. హైకోర్టుకు పోయి ధర్నా చౌక్‌ను కొనసాగించుకునేలా ఉద్యమమే చేశారు. సాధించారు. కేసీఆర్‌కు ఇదో చెంపపెట్టు సమాధానమని సంకేతమిచ్చారు. సరే, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. బళ్లు ఓడలు, ఓడలు బళ్లవుతాయి. మాకు తిరిగేలేదు. రాజకీయ పునరేకీకరణ పేరుతో అందరినీ పార్టీలు కలుపుకుని ప్రతిపక్షమే లేకుండా చేసి… విర్రవీగిన తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా పరిస్థితులు ఏర్పడ్డాయి.
రైతులంతా మావైపే.. వాళ్లకు మేం చేస్తున్న మేలు ప్రపచంలోనే ఎవరూ చేయడం లేదు.. అని బీరాలు పోయిన ప్రభుత్వం.. ఇప్పుడు కేంద్రం పెట్టిన మెలికతో గిలిగిలా కొట్టుకుంటుంది. యాసంగిలో వడ్లు కొనమని చెప్పడంతో ఇటు రైతులకు వరి వేయొద్దంటే కోపం.. వేస్తే కొనలేరు. కేంద్రం తీసుకోదు. మరెలా.. ? మనమెందుకు దోషి కావాలె… కేంద్రాన్నే సర్కిల్ చేసి ధర్నాలు చేస్తే.. ఆందోళనలకు దిగితే.. రైతుల మద్దతు కూడగట్టుకుంటే..
అదే ఆలోచనతో కేసీఆర్ 12న ధర్నా చేపట్టాడు. ఇదే విషయంలో. హైదరాబాద్‌లో ఇప్పుడు వారికి ధర్నా చౌకే దిక్కయ్యింది. ఒకప్పుడు ఈ ధర్నా చౌక్‌ను కాలదన్నిన కేసీఆర్‌కు ఇప్పుడు హస్తినతో పోరాడడానికి ఇదే వేదికైంది. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఈ చౌక్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కేసీఆర్‌కు ఇకనైనా తత్వం బోధపడ్డదంటారా? అలా జరిగితే ఆయన కేసీఆర్ ఎందుకవుతాడు..?
