హరీశ్‌రావంటే.. పార్టీలకతీతంగా అందరూ గౌరవించేవాళ్లు. మంచి వక్త. స్నేహశీలి. అందరితో కలిసిపోయే మనస్తత్వం. సబ్జెక్టు ఉన్నోడు. అన్నింటికీ మించి అతనో ట్రబుల్ షూటర్. పార్టీ కష్టాల్లో ఉంటే ఎలాగైనా సరే తను విజయతీరాలకు పార్టీని చేరుస్తాడు. అందుకే కేసీఆర్‌కు హరీశ్ అంటే ఓ గురి. పార్టీలో ఎదగనీయకుండా ఎప్పటికప్పుడు తొక్కేస్తూనే.. ఇలా అవసరానికి వాడుకుంటూ ఉంటాడు కేసీఆర్.
నాలుగు గోడల మధ్య అవమానించి… అందరిలో కౌగిలించుకోవడం కేసీఆర్ స్టైల్. కానీ ఏనాడూ హరీశ్ మామ మాట జవదాటలేదు. ఏ పని చెప్పినా నిబద్దతతో చేశాడు. పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము గాకుండా చూసుకునేవాడు. అందుకే ట్రబుల్ షూటర్‌గా ఆ పేరు అతనికి అక్షరాల నప్పింది. కానీ మొన్న దుబ్బాకలో దెబ్బకొట్టిన బీజేపీ.. ఇప్పుడు హుజురాబాద్‌లో ఈటల రూపంలో దారుణంగా బొంద పెట్టింది.
ఇక ఎవరైనా పార్టీలో గానీ, బయట గానీ ట్రబుల్ షూటర్ అని ఉచ్చిరించాలంటేనే తమను తాము తమాయించుకోవాల్సిన పరిస్థితులున్నాయి. అయిపోయింది ట్రబుల్ షూటర్ పని. మామ పెట్టిన శల్య పరీక్షలకు అల్లుడు బలికావాల్సి వచ్చింది. కొడుకు రాజకీయం కోసం అల్లుడు త్యాగాల ముళ్ల కిరీటాన్ని పెట్టుకుంటూనే ఉన్నాడు. శిలువ ఎక్కుతూనే ఉన్నాడు. ఇక ఇది చివరి అంకానికి చేరుకున్నది. మొన్నటి మొన్న హరీశ్ లేకుండానే ప్లీనరీ కానిచ్చేశారు. పేరుకే మళ్లీ కేసీఆర్ పార్టీకి ప్రెసిడెంట్. కానీ అన్ని అధికారాలూ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కొడుకు కేటీఆర్‌కు అప్పగించేశాడు. ప్లీనరీ వేదికగా కేటీఆర్ చేతుల్లో పెట్టాడు కేసీఆర్. ఇక సీఎంను చేయడమే లేటు. యాదాద్రి కార్యక్రమం ఒకటి అయిపోగానే ఇక దీనికీ ముహూర్తం పెట్టేస్తాడు.
ఇక హరీశ్ పీడ లేదు. బాధ లేదు. ఎదురు తిరిగే సీనూ లేదు. కోరలన్నీ పీకేశానని కేసీఆర్ అనుకుంటున్నారు. కొడుకుకు అన్ని రూట్లు క్లియర్ చేశాననీ అనుకుంటున్నాడు. కానీ హరీశ్ రూపంలో కేసీఆర్ కు ఎప్పుడూ తలనొప్పులు తప్పవు. తలవంపులు ఉండవని భావించడం తప్పు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.
తనదారి తాను చూసుకోవాలని అని ఆలోచన వచ్చిన నాడు హరీశ్ ఓ శక్తిగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు మామ చాటున దాగున్న ఓ పసిబిడ్డే కావచ్చొ. కానీ హరీశ్ శక్తిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పటికైతే బద్నాం అయ్యాడు. ట్రబుల్ షూటర్ బిరుదు పోగొట్టుకున్నాడు. అబద్దాల కోరుగా ముద్రపడ్డాడు. హరీశ్‌కు ఇలా అవలీలగా మామకు మించి అబద్దాలు ఆడగలడా..? అని అంతా ముక్కున వేలేసుకునేలా చేశాడు. కులం చెడ్డా సుఖం దక్కుతుందనుకున్నాడు.. రెంటికీ రెడ్డ రేవడిలా తయారయ్యింది పరిస్థితి.