ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. కేసీఆర్ పిలుపుకు కదిలి వచ్చారు. ఆయన వెంట నడిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు .. ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు ఓపికగా. ఎక్కడా పార్టీ మారలేదు. సహనం వీడలేదు. ఉద్యమ స్తూర్తి వదల లేదు. తమ నాయకుడు ఎప్పుడో ఒకసారి గుర్తిస్తాడనే అపారమైన నమ్మకం వారిది. అందుకే ఓపిక పట్టారు.
కానీ సహనం నశించింది ఓదశలో. నోరు తెరిచి అడిగితే తప్ప పట్టించుకునేలా లేరు అనే స్థితిని గుర్తించారు. ఇక తమ గోడు వెళ్లబోసుకునేందుకు ముందుకు కదిలారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల ఎంపీపీ నర్సింగ్ రావు తన అనుచరులు, పార్టీ నేతలు, నాటి ఉద్యమ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లో ఈ రోజు కలిశారు.
పార్టీ ఆవిర్భావం నుంచీ కేసీఆర్ వెంట ఉన్నాం.. ఏం పదవులూ ఆశించలేదు. మీరే ఇస్తారని ఓపికగా చూశాం. ఎవరెవరో వస్తున్నారో.. పదవులు తీసుకుంటున్నారు. మావి మాత్రం కరివెపాకు జీవితాలే అయ్యాయి. మాకు పదవులు కావాలె.. అని తన గోడు వెళ్లబోసుకున్నారు కవిత ముందు. నవీపేట మండల పార్టీ ప్రెసిడెంట్ నర్సింగరావు టీఆరెస్ పార్టీ పుట్టినప్పటి నుంచీ ఉన్నాడు. మండల పార్టీ ప్రెసిడెంట్‌కే పరిమతయ్యాడు. అంతకు మించి ఎదగలేకపోయాడు. తనకు ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలట. అదే విషయాన్ని కవిత ముందుంచాడు. ఆమె షరా మామూలుగా సరే చూద్దాం.. చేద్దాం అని చెప్పి పంపారట.
పార్టీ పదువుల్లో, ప్రభుత్వ పదవుల్లో తమను చిన్నచూపు చూస్తున్నారని, పట్టించుకోవడం లేదనే ఆవేదన ఉద్యమకారుల్లో ఉంది. వారి అసహనం మెల్లగా బయటపడుతున్నది. పడితే ఏం చేస్తారు? పార్టీ సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలే ఇంపార్టెంటు. మీరంతా అవసరమైతే త్యాగం చేస్తూ ఉండాలి. చేస్తూనే ఉండాలి. మీరంతా పార్టీకి కట్టప్పలు. చెప్పింది చేయాలి తప్ప… ఏదో ఆశించొద్దు. ఆశించి భంగపడొడ్డు. చెబితే అర్థం చేసుకోవాలె. అంతే.