అయ్యో అప్పుడే ఎన్నికలా? ఇవ్విప్పట్లో రావనుకున్నామే. ఇంకా రెండు మూడు నెలలు పడుతుందనుకున్నామే…
ఇప్పుడెలా..? ఈ నెలరోజుల తర్వాత మా పరిస్థితి ఏందీ?
ఇప్పటి వరకు అన్నీ ఇచ్చారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు.. ! కానీ మీరు.. ఇంటికాడికొచ్చి అన్నీ ఇస్తున్నారు.
ఇంతటి మహాద్భాగ్యం మళ్లీ దొరికేదెన్నడు…? మీరు మళ్లా మా దగ్గరికి వచ్చేదెప్పుడు..?
అడగకుండానే దళితబంధిచ్చారు. అడగకుండానే పింఛన్లు ఇచ్చారు. పిలిచి మరీ పదవులిచ్చారు. పండుగ రోజు తప్ప కడుపు నిండా తాగి, తిన్నది లేదు.. కానీ ఇన్ని రోజులూ రోజూ పండగనే కళ్లముందుంచారు.
నిత్య కళ్యాణంలా కమనీయంగా సాగుతున్న ఈ రోజుల్నెలా మరిచిపోవాలె. కలలో కూడా ఎరగని వరాలచ్చిన ప్రభువులనెలా విడిచి ఉండాలె.
పొద్దున మేం లేవకుముందే .. ముకారవిందాలతో మీరు వచ్చి మాకు స్వాగతం పలికి నిద్రలేపి క్షేమ సమచారాలు ఎవరడగాలె..?
కరోనా వేళ పనుల్లేక పస్తులుంటున్న మా వద్దకు ఆ భగవంతుదే మిమ్మల్ని పంపాడని భావించామె? ఇది మా పూర్వ జన్మ సుకృతమని అనుకున్నామె..?
అప్పుడే మా ఆశలపై నీళ్లు పోస్తారా? ఎన్నికలు కాగానే పత్తా లేకుండా పోతారా? మళ్లా మిమ్మల్ని కలవాలంటే ఎక్కడికి రావాలి?
హైదరాబాదా? ప్రగతిభవనా?? సిద్దిపేటనా..???
మేమొస్తే మమ్మల్ని గుర్తుపడతారా? ఇదే ఆప్యాయత కురిపిస్తారా? ఖర్చులకు లేవంటే అర్సుకుంటారా??
కడుపు నింపుతారా? కౌగిలించుకుంటారా?? ఆప్యాయంగా అన్నా, తమ్మీ అని మాట్లాడతారా?