పండుగ లేదు.. పబ్బం లేదు. మంచీ లేదు చెడూ లేదు. రాత్రి పగలు ఒకటే ధ్యాస …హుజురాబాద్. హుజురాబాద్. హుజురాబాద్. పాపం..! హరీశ్‌రావుకు మంచి పేరుండే. ట్రబుల్ షూటర్‌గా ఓ గుర్తుంపుండే. హుజురాబాద్ ఉప ఎన్నిక పుణ్యమా అని కష్టపడి తెచ్చుకున్న గ్రాఫ్ అంతా పడిపోతున్నది. దాదాపు మూడు నెలలుగా ఆయన అక్కడే తిష్టవేశాడు. అడుగు బయట పెట్టడం లేదు. మనసంతా హుజురావబాదే. అక్కడ చీమ చిటుక్కుమన్నా… ఉలిక్కిపడే పరిస్థితి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పులఈశ్వర్, గంగుల కమలాకర్ .. వీళ్లంతా అక్కడే తిష్టవేశారు. వీరంతా ఉండటం పెద్ద వార్తమీ కాదు… కానీ హరీశ్ ఇన్ని రోజులు ఒక ఉప ఎన్నిక కోసం పోరాడటం ఆయనకూ ఇబ్బందిగానే ఉన్నట్టుంది. ట్రబుల్ షూటర్‌కు ఈ హుజురాబాద్ ఓ పెద్ద ట్రబుల్‌గా మారింది.
ఖర్మకాలి ఆ నోటిఫికేషన్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఎన్ని రోజులు పడుతుందో కూడా ఎవరూ క్లారిటీ చెప్పలేని పరిస్థితి. కానీ ప్రచారం ఆపేది లేదు. పార్టీలోకి ఆహ్వానించడం ఆపడం కుదరదు. హామీలివ్వడం ఆపడం సాధ్యం కాదు. నిధులు నీళ్లలా ఖర్చు చేయడమూ ఆపే తరము కాదు. ఏదీ ఆగడం లేదు. సమయం మాత్రం సాగుతూనే ఉంది. నియోజకవర్గాన్ని వదిలేసి ఎన్నిరోజులైందో? ఈ ఎన్నికైతే హరీశ్‌కు ఇక్కడి ప్రజలకు ఏం సంబంధం ఉండదు. కానీ ప్రజలకు మాత్రం హరీశ్ చాలా హామీలనే ఇస్తున్నాడు. అవలీలగా అబద్దాలూ వల్లెవేస్తున్నాడు. ఎన్నికల్లో గెలిచేందుకు. కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేసేందుకు. కానీ ఒక్కటి మాత్రం గుర్తించాడో.. గుర్తించలేదో తెలియదు.. తన గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తున్నది.