సర్కారు దవాఖానల పై నమ్మకం నానాటికి సన్నగిల్లుతున్నది జనాలకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాల బలోపేతం పై పెద్దగా దృష్టి సారించలేదు. తమిళనాడులో జయలలిత ప్రవేశపెట్టిన పథకానికి కాపీగా కేసీఆర్ కిట్టును మాత్రం ఇక్కడ అమలు చేశాడు. కానీ ఆస్పత్రుల అవసరాలు, సౌకర్యాల పై నజర్ పెట్టలేదు. దీంతో ప్రభుత్వ దవాఖానల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసిన చందంగా ఉండిపోయింది.
మొదటి నుంచి పేద, మధ్య తరగతి ప్రజలు రోగాల బారిన పడినప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులనే ఆశ్రయించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ అదే దుస్థితి కొనసాగుతున్నది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించుకునేందుకు దాచుకున్నవి ఖర్చు చేసుకుంటున్నారు.. కొత్తగా అప్పులు తెచ్చి పెడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకా మారలేదు. కరోనా వేళ ప్రైవేట్ దోపిడీ మరింత పెరగడంతో పేదవాడికి వైద్యం ఖర్చుతో కూడుకొని పెను భారంగా మారింది.
తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ ఓ రిపోర్టులో తెలుగు రాష్ట్రాల ప్రజల వైద్య చికిత్సల భారం పై ఒక రిపోర్టును విడుదల చేసింది. తెలంగాణలో 75.5 శాతం మంది, ఏపీలో 52.2 శాతం వైద్య ఖర్చుల కోసం దాచుకున్న డబ్బును వెచ్చిస్తున్నారని, 16.3 శాతం తెలంగాణలో అప్పులు చేస్తుండగా.. 28.2 శాతం ఆంధ్రాలో అప్పులు తెచ్చి మరీ వైద్య ఖర్చుల కోసం వినియోగిస్తున్నట్లుగా నివేదికలో పేర్కొన్నది. ఆరోగ్య బీమా లేని వాళ్లు ఏపీతో పోలిస్తే తెలంగాణలోను ఎక్కువగా ఉన్నారు. ఏపీ గ్రామాల్లో 22.9 శాతం, తెలంగాణలో 29శాతం మంది ఎటువంటి బీమా సౌకర్యం లేకుండా ఉంటున్నారు.
అత్యవసర చికిత్సల కోసం అప్పులు చేసి మరీంత పేదవారవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇకనైనా ప్రభుత్వ దవాఖానల పై నమ్మకం పెరిగే విధంగా పాలకులు దృష్టి సారిస్తే పేదవాడికి నాణ్యతతో కూడిన ఉచిత వైద్యం అందితే ఈ అప్పుల తిప్పలు ఉండవు. గాల్లో ప్రాణాలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఉండదు. పేదవారు మరింత పేదవారిగా మారే పరిస్థితులు రావు.