(దండుగుల శ్రీనివాస్‌)

ఊరు పేరు తెల్వనోడు తెల్లారి లేవగానే ఎక్కడ ఏ దవఖాన తెరస్తడో తెలవదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు ఆస్పత్రలు జలగల్లా పీడిస్తున్నాయి. రక్తం తాగుతున్నాయి. బిల్లుల పేరుతో ప్రాణాలు తోడేస్తున్నాయి. పేదల ప్రాణాలు, ఆరోగ్యాలే పెట్టుబడిగా ఎదుగుతున్నాయి. వీటిపై ఇప్పుడు సర్కార్‌ నజర్‌ పెట్టింది. లెసెన్సులు లేకుండా ఇష్టారీతిన దవాఖానలు నడిపే వారి భరతం పట్టేందుకు , అసౌకర్యాలకు నిలయంగాఉంటూ వైద్యం పేరుతో వేల రూపాయలు పిండి వసూలు చేసే రోగాలకు చికిత్స మొదలు పెట్టింది. రేపటి నుంచి నిజామాబాద్‌ జిల్లాలో వైద్యారోగ్యశాఖ ఆద్వర్యంలో పదిరోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగనుంది.

ఇక దాడుల పరంపరతో దగాఖానల పని ఖతం కానుంది. దీన్ని సర్కార్‌ సీరియస్‌గా తీసుకున్నది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు జిల్లా కేంద్రంలో జరిగిన పలు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యల దోపిడీ, నిర్లక్ష్యంపై సీరియస్‌ యాక్షన్‌లోకి దిగారు. సర్కార్ఆదేశాలతో ఇది మరింత ఉధృతం కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అధికారులతో ఇలాంటి దాడులు చేయించింది సర్కార్‌. పదుల సంఖ్యలో దోషాలు, నేరాలు, నిర్లక్ష్యాలు, అలసత్వాలు, అన్యాయాలను, అసౌకర్యాలను గుర్తించింది అధికార యంత్రాంగం. దీనిపై సీరియస్‌ చర్యలు తీసుకున్నది. ఇప్పుడు ఇక నిజామాబాద్‌ వంతు. జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు దవాఖానలు వెలిశాయి.

జిల్లాలోని మారుమూల ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారు కూడా ఎమర్జెన్సీ సేవల కోసం ఇక్కడికి వస్తుంటారు. వీరిని ఆధారం చేసుకుని కోట్లాది రూపాయల దోపడీకి తెగబడుతున్నాయి ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు. ప్రాణాలు తీస్తున్నాయి. అయినా అడిగేవారు లేకపోవడంతో డబ్బులు దండుకుంటూనే ఉన్నాయి. మెడికవర్‌ ఆస్పత్రి విషయంలో ఎంక్వైరీ తుదిదశకు వచ్చింది. షాహిన్‌ సేవలను కలెక్టర్‌ నిలిపివేశారు. ఇప్పుడిక వీరు వారు అని కాదు.. అన్నీ ఆస్పత్రల్లో తనిఖీలుంటాయి. ఫీజుల దోపిడీపై ఆరా ఉంటుంది. అసౌకర్యాలు,అసలత్వాలకు అడ్డుకట్టపడుతుంది. దొంగ డాక్టర్లను బరిబాతల బజారుకీడ్చే పనీ జరుగుతుంది. స్కానింగ్‌ సెంటర్ల నిర్వహణ తీరు ఇటీవల తీవ్ర దుమారం రేపింది. దీనిపై రచ్చ మొదలైంది.

You missed