పెంపుడు కుక్క‌ల‌ను ఎంతో ప్రేమ‌తో పెంచుకుంటారు. పేగు బంధం కంటే ఎక్కువ మమ‌కారం చూపిస్తారు కొంద‌రు. ఆ కుటుంబ స‌భ్యుల‌తో అవి విడ‌దీయాలేని బంధాన్ని ఏర్ప‌చుకుంటాయి. ఆత్మీయ‌త, అనురాగాల‌ను పంచుకుంటాయి. అలాంటి పెట్‌డాగ్స్ అనుకోకుండా అంతుచిక్క‌ని వ్యాధితో రోజుల వ్య‌వధిలోనే చ‌నిపోతే? ఆ య‌జ‌మాని మ‌నోవేద‌న అంతాఇంతా కాదు. వారు ప‌డే న‌ర‌క‌యాత‌న చెప్ప‌న‌ల‌వి కాదు. ఈ మ‌ధ్య కాలంలో అంతుచిక్క‌ని వైర‌స్‌తో పెంపుడు కుక్క‌లు ప‌ట‌ప‌టా రాలిపోతున్నాయి.

వ్యాధి ఏందో తెలుసుకుని, చికిత్స తీసుకునేలోపు ప‌రిస్థితి చేయిదాటిపోతున్న‌ది. ల‌క్ష‌లు పెట్టి పెట్‌డాగ్స్ కొంటున్నారు. విలువ క‌ట్ట‌లేని ఆత్మీయ‌త వాటితో పెంచుకుంటున్నారు. మ‌ధ్య‌లో వైర‌స్ దాడి చేసి ఈ అనుబంధాన్ని విడ‌దీసి ఆ డాగ్స్‌ను కాటేస్తున్న‌ది. చికిత్స కోసం కూడా ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడుతున్నారు. అయినా ఫ‌లితం ద‌క్క‌డం లేదు. అస‌లు ఈ వైర‌స్ ఏందీ? ఎందుకు వ‌స్తుంది? దీనికి చికిత్స లేదా? అనే ప్ర‌శ్న‌ల‌కు క‌రెక్టుగా స‌మాధానాలు వైద్యులు కూడా చెప్ప‌డం లేదు.

దీన్ని హెప‌టైటిస్ వ్యాధిగా చెబుతున్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం సెవ‌న్ ఇన్ వ‌న్ అనే వ్యాక్సిన్‌ను వీటికి వేయించాల్సి ఉంటుంది. 700 రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంది. కానీ ఏ వైద్యుడు కూడా ఈ వ్యాక్సిన్ గురించి పెంపుడు కుక్క‌ల‌ను పెంచుకుంటున్న య‌జ‌మానుల‌కు చెప్ప‌డం లేదు. దీంతో ఈ వైరస్ ఎప్పుడూ సొకుతుందో తెలియ‌క, సొకిన త‌ర్వాత చికిత్స చేసిన లివ‌ర్ చెడిపోయి రోజుల వ్య‌వ‌ధిలోనే అవి మృత్యువాత ప‌డుతున్నాయి. ఒక్క డాగ్‌కు వైర‌స్ వ్యాప్తి చెందితే ఆ ఇంట్లో ఎన్ని కుక్క‌లున్నా వాటికీ అది సొకి మృత్యువాత ప‌డ‌క త‌ప్ప‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌హాన‌గ‌రం హైద‌రాబాద్‌లో ఈ మ‌ధ్య కాలంలో చాలా చోటు చేసుకున్నాయి.