సీఎం కేసీఆర్ తీసుకున్న ‘కేజీ టు పీజీ’ రీ ఓపెనింగ్ నిర్ణ‌యం త‌ప్ప‌ని ఒక‌రంటే.. కాద‌ని మ‌రొక‌రు.. ఇలా ఎవ‌రికి వారే త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. ప‌రస్ప‌ర భేదాభిప్రాయ‌ల‌ను వ్య‌క్తం చేస్తున్న‌ది ఒక‌టే సెక్ష‌న్ కావ‌డం విశేషం. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్లు ఈ విష‌యంలో కుమ్ములాడుకుంటున్నారు. ఒక‌రిపై ఒక‌రు తిట్ల వ‌ర్షం కురిపించుకుంటున్నారు. చొక్కాలు చించుకుంటున్నారు. ఇదెంత వ‌ర‌కు పోయిందంటే ఒక‌రినొక‌రు బ్లాకులు చేసుకునే వ‌ర‌కు.

వ‌చ్చే నెల ఒక‌టో తారీఖు నుంచి అన్ని విద్యాసంస్థ‌లు తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే క‌రోనా థ‌ర్డ్ వేవ్ భ‌యం ఇంకా వీడ‌లేదు. ఇత‌ర చోట్ల కేసులు కూడా న‌మోదవుతున్న సంద‌ర్భంతో పాటు ఇది చిన్న పిల్ల‌ల‌కు ఎక్కువ హాని క‌లిగిస్తుంద‌నే ప్ర‌చారం ఉంది. ఆ మేర‌కు వైద్య‌శాఖ కూడా ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ది. ‘ఇలాంటి ప‌రిస్థితుల్లో పిల్ల‌ల‌ను స్కూళ్ల‌కు ర‌ప్పించి క‌రోనా అంటించ‌డం భావ్య‌మా?’ అనే టీఆరెస్ శ్రేణులే ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాయి. ‘క‌నీసం ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌క‌న్నా ఆన్‌లైన్ క్లాసులు పెట్టాల‌’ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు మ‌రికొంద‌రు టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్లు దీన్ని ఖండిస్తున్నారు. ‘నువ్వేమ‌న్నా మేథావివా? కేసీఆర్ మేథావుల‌తో చ‌ర్చించే ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు.. మూసుకోవోయ్’ అని ఎక‌సెక్కాల‌డుతూ పోస్టులు పెడుతున్నారు.

మ‌రికొంద‌రు ‘క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఫీజులు వ‌సూలు చేసే వ‌ర‌కు రాద‌ని, వ‌సూలు చేయ‌గానే వ‌స్తుంద‌’ని విమర్శ‌ల‌కు దిగారు. పిల్ల‌ల యోగ క్షేమాల కోస‌మే మేము ప్ర‌భుత్వానికి స్కూళ్లు తెర‌వొద్ద‌ని సూచ‌న చేస్తున్నామ‌ని ,కానీ కొంత మంది జోగుడు గాళ్ల‌కు ఇది న‌చ్చ‌డం లేదంటూ టీఆరెస్ శ్రేణుల‌పైనే మాటల దాడుల‌కు దిగుతున్నారు. మ‌రో నాలుగైదు రోజుల్లో విద్యా సంస్థ‌లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో.. ఈ చ‌ర్చ‌, ర‌చ్చ రోజు రోజుకు పెరుగుతున్న‌ది. మ‌రోవైపు ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యం మేర‌కు ముందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ది.