అందరి దృష్టి ఇప్పుడు హుజురాబాద్‌పై ఉంది. అది ఒక్క ఉప ఎన్నికలా చూడటం లేదు ఎవరు. కేసీఆర్ ఈ ఎన్నికను జీవన్మరణ సమస్యలా చూస్తున్నాడు. గెలిస్తే .. అత్యధిక మెజార్టీ రావాలె. బొటాబొటా మెజార్టీ వచ్చినా కష్టమే. మరి ఓడితే ఇక చెప్పనవసరం లేదు. మున్ముందు ఇంకా పార్టీ కి ఎంత కష్టకాలమో? బీజేపీ కి కూడా ఇది కీలకమైన పోరే. కానీ దీన్ని ఈటల వ్యక్తిగత పోరుగా ఆ పార్టీ అధిష్టానం చూస్తున్నది. దీంతో ఎవరికి వారే యమునాతీరే మాదిరిగా .. ఈ బరి నుంచి పక్కకు తప్పుకున్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు.
ఈటల ఒక్కడే ఒంటరిపోరు చేస్తున్నాడు. బీజేపీ పెద్దలు అనుకున్నట్టు ఇది ఈటల ఒంటరిపోరుగానే మిగిలిపోతున్నది.మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడో తెలియని పరిస్థితి నెలకొన్నది. ‘నిన్ననే షెడ్యూల్ రావాల్సి ఉండె. కానీ ఎందుకు రాలేదో తెలియద’ని బీజేపీ నాయకులు అనుకుంటున్నారు. ఈ ఉత్కంఠ ఇలా కొనసాగుతుండగా.. ఈటలకు పుండు మీదకారం చల్లినట్టుగా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఈనెల 24 నుంచి ఇది ఉంటుందని దీనికి ఓ పేరు కూడా పెట్టుకున్నారు. హుజురాబాద్ బరిలో నుంచి కత్తీడాలు వదిలేసి ఇక బయటకు వచ్చేసినట్టేననే సంకేతాలిచ్చారు.
కేంద్రంతో కేసీఆర్‌కు ఉన్న సంబంధాల వల్ల ఈ ఫైట్‌ను బీజేపీ లైట్ తీసుకుంటున్నదా? అనే అనుమానాలూ రేకెత్తుతున్నాయి. ఓ వైపు కేసీఆర్ పగతో రగిలిపోతున్నాడు. ప్రతీకారేచ్చతో శక్తులను మోహరించాడు. ఈటలను చావు దెబ్బ తీసేందుకు అన్నీ రెడీ చేసుకున్నాడు. ఇక ముహూర్తమే తరువాయి అన్న చందంగా ఉంది. కానీ బీజేపీ అగ్రనేతలు మాత్రం దీన్ని లైట్ తీసుకున్నారు. కేసీఆర్ ఖాతాలోకి వెళ్లే సీటుగా డిసైడ్ అయినట్టున్నారు. ‘ఇది వారిద్దరి కొట్లాట. మా పార్టీకేం సంబంధం’ అన్నట్టుగా ఉన్నాయి వారి ఆలోచనలు. ఒకవేళ దీనిపై గట్టిగా పోరాడి చావు దెబ్బతింటే.. బీజేపీ పని ఖతమైపోయిందనే సంకేతాలు వస్తాయేమో? అనే భయం ఉన్నట్టుంది ఆ పార్టీఅగ్రనేతలకు. పార్టీని రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేసి .. బీజేపీకి హుజురాబాద్ ఒక్కటే ముఖ్యం కాదు.. స్టేట్ లెవల్లో బలం పెంచుకోవడమే.. అని ప్రజలు అనుకోవాలనేది బండి సంజయ్ ప్లాన్‌గా కనిపిస్తున్నది. ఇక్కడ సీఎంను ఢీకొట్టడం మా వల్ల కాదు అని బీజేపీ అగ్ర నేతలు చేతులెత్తేసినట్టేనా…?