చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైనయట్లు….
కష్టపడి పత్రికను నిలబెట్టి, దాని లక్ష్య సాధనలో ముందుకు పోతున్న తరుణంలో కొత్తగా వచ్చి చేరిన వారిదే ఇప్పుడు పెత్తనం నడుస్తున్నది. నడిమంతరపు సిరితో కన్నుమిన్ను కానరాకుండా ఉన్నారు. గత చరిత్రతో వారికి పనిలేదు. ఇప్పుడు మా శకం. మా చేతిలో అస్త్రం. ఇది మా టైం. మేం చెబితే అదే నడవాలి. నాదే నడవాలి. నేనే గొప్ప. నా వల్లే ఇదంతా.. ఇప్పుడు ఇలాంటి మానియాతో రగిలిపోతున్నారు.. ఆ ముగ్గురు. “ఇంతకీ ఎవరా ముగ్గరు?”,
” ఏమా కథ?”
నమస్తే తెలంగాణ పత్రిక గురించి మనం చెప్పుకుంటున్నది. ఇదో మూడో ఎపిసోడ్.. ఇంకా వరుసగా వస్తాయి కొన్ని రోజుల పాటు. ఇది కేవలం పత్రిక గురించే చెప్పడం కాదు. పాలకుల వైఫల్యమూ ఇందులో ఉంది. అక్కడ జరుగున్న లోపాలే ఇక్కడా జరుగుతున్నాయి. దానికీ దీనికి దగ్గర సంబంధాలున్నాయి. అందుకే ఇతర పత్రికల రాజకీయాలకు, ఈ పత్రికలో ప్రస్తుత పరిస్థితికి చాలా తేడా ఉంది. అందుకే ప్రత్యేకంగా చెప్పుకునేది.
కొత్త ఎడిటర్‌గా తీగుళ్ల కృష్ణమూర్తిని తీసుకొచ్చింది దేశ్‌పతి శ్రీనివాస్. బ్రాహ్మణకార్డును కేసీఆర్ దగ్గర ప్రయోగించి ఆయన ఆశీస్సులు పొందడంలో దేశపతి సక్సెసయ్యాడు. కేసీఆర్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని గర్వంతో ఇక తీగుళ్ల రెచ్చిపోయాడు. ఇష్టం వచ్చినట్లు ఉద్యోగులను తీసేశాడు. కరోనా కన్నా కర్కశంగా ప్రవర్తించాడు. అప్పటికే అక్కడ ఓరుగంటి సతీష్ వచ్చి ఉన్నాడు. బ్యూరో చీఫ్‌గా ఉన్నా.. తనే షాడో ఎడిటర్‌గా చెలామణి అయ్యాడు. కట్టా శేఖర్‌రెడ్డిని డమ్మీ చేయబోయి ధమ్కీ తిన్నాడు. ఆ తర్వాత సమయం కోసం ఎదురుచూడసాగాడు. తనే ఎడిటర్ కావాలనే ఆశ అత్యాశే అని తేలిపోవడంతో.. ఎవరికి కట్టబెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు కృష్ణమూర్తి పేరు వచ్చినప్పుడు… కులమొకటే కాబట్టి సై అన్నాడు. కానీ తన ఉనికి ఎంత బలమైందో చెప్పే ప్రయత్నం చేశాడు. తన ప్రయార్టీ తగ్గితే బాగోదు సుమా..! అనే విధంగా సంకేతాలిచ్చాడు. లోపలికి జొచ్చేదాకా మంచిగానే ఉన్నాడు. తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు కృ.తి.
దీంతో ఓరుగంటి ఆగమాగమయ్యాడు. తన ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే భయం పట్టుకున్నాది. తనకు తెలిసిన పెద్దలకు చెప్పాడు. ఫిర్యాదులు చేశాడు. ఫలితం లేదు. దీంతో కృష్ణమూర్తి కూడా రెచ్చిపోయి.. ఓరుగంటి సతీష్‌పై ఫేక్ పోస్టింగులు పెట్టించాడు. ఇక ఏడవటం ఒక్కటే తక్కువ ఓరుగంటికి. అలా ఇద్దరి మధ్యా దూరం పెరిగిపోయింది. మెల్లగా నెట్‌వర్క్ ఇన్ఛార్జి ఎస్జీవీ శ్రీనివాస్ కోరలు పీకడం ప్రారంభించాడు కొత్త ఎడిటర్. జిల్లాల నెట్‌వర్క్‌లో జోక్యం చేసుకొని, మార్పులు, చేర్పులు అంతా తనే చూసుకున్నాడు. వీరిని ముందు పెట్టుకొని. తన బంగారు పుట్టలో వేలిపెడితే ఎస్జీవీ ఊరుకుంటాడా?.. ఎండీకి ఫిర్యాదు చేశాడు. సంతోష్‌కు చెప్పాడు. కానీ వాళ్లు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. “అంతా కేసీఆర్ చెప్పినట్టే చేస్తున్నా..” అనే బూచీని వాడుకున్నాడు. “తన జోలికి వస్తే కేసీఆర్‌కు చెప్తా” అనే రేంజ్‌లో బెదిరింపులకు దిగాడు కొత్త ఎడిటర్. ఇక అతని ఆగడాలకు అంతులేదు. ఓరుగంటికి ఎస్జీవీ తోడయ్యాడు. ఇద్దరూ అవకాశం కోసం చూస్తున్నారు. కానీ ఎవరి గ్రూపులు వారివే. ఎవరి సామ్రాజ్యాలు వారివే. ఒకరి సామ్రాజ్యంలో ఒకరు వేలుపెట్టినప్పుడే ఈ గొడవంతా.
నిత్యం కొట్లాటలే. సమావేశాల్లో అరుచుకోవడాలు కామన్ అయిపోయింది. ఆ అరుపులు అక్కడి స్టాప్‌కు వినిపించేంతగా. ఆధిపత్యం కోసం పోటీ. పత్రిక వ్యాల్యూస్, సర్క్యూలేషన్.. ఇవన్నీ పట్టించుకునే స్థితిలో వారులేరు. ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డెం. “నీ మాట నడవదు. నా మాటే నడుస్తుంద”ని వేదికల మీదే చిన్నపిల్లల్లా కయ్యాలు. “ఒకప్పుడు ఎట్లుండే నమస్తే తెలంగాణ … ఇప్పుడెట్లయ్యింది.? ” అందరి నోటా ఇదే చర్చ.
“నాకు కేసీఆర్ బాగా దగ్గర. నాతో రోజూ మాట్లాడతాడు.” ఓరుగంటి అంటాడు. ఊదరగొడతాడు. “నేను మాత్రం తక్కువనా.. నేను పెట్టిన పేజీ చాలా బాగుంది.. పెట్టించిన వార్త సూపర్ అని కేసీఆర్ పొద్దున్నే ఫోన్ చేసి అరగంట మాట్లాడాడు తెలుసా?” అంటాడు కృష్ణమూర్తి. “నేను వెలమ.. ప్రభుత్వమే మాది. మీడియాను శాసిస్తున్న సంతోషే నాకు చాలా దగ్గర. ఎండీ ఇంకా దగ్గర. నాతో పెట్టుకోకండి.. నాజోలికి వస్తే బాగుండదు” అని ఎస్జీవీ సవాల్ విసురుతాడు.
సఖ్యత ఉండదు. ఒకరు ఒకటి చేద్దామంటే.. ఇంకొకరు “అది బాగుండదు.. ఇలా చేయాలంటరు.” చివరకు ఏ పనీ కాదు. సర్క్యూలేషన్ దారుణంగా పడిపోయినా పట్టింపు లేదు. తమ ఉనికిని కాపాడుకోవడమే ఇప్పుడు వీళ్ల కర్తవ్యం. దీంతో పాటు ఎడిటర్‌ను ఎప్పుడు ఎగరగొట్టాలా అని ఓరుగంటి, ఎస్‌జీవీ కాపుకాసుకుని చూస్తుంటారు. పొగ పెడుతూ ఉంటారు. ఓరుగంటిని టీన్యూస్ కన్నా.. ఇంకెక్కడికైనా సాగనంపితే “నాకు తిరుగులేదు కదా.. వీడి పీడ విరగడవుతుంది..” అనుకుంటాడు ఎడిటర్. “ఎడిటర్ పోతే.. అది నాకే ఇస్తే.. ” కలలు కంటుంటాడు ఎస్‌జీవీ.
ఈ మూడు కుర్చీలాటలో పత్రిక బలైపోయింది. పెద్దలకు పట్టింపు లేదు. వారి రాజకీయాలు వారివి. పొద్దున్నే మన ఫోటో వచ్చిందా? కవరేజీ బాగుందా..? రంగులు బాగా అద్దారా? అదే కావాలి. వారికేం కావాలో ఎడిటర్‌కు తెలుసు. వండి, వార్చి వడ్డిస్తాడు.అది చూడగానే వారి కడుపు నిండేలా. లోపల అజీర్తి వల్ల నమస్తే తెలంగాణ గ్యాస్ ట్రబుల్‌తో బాధపడుతుందని, ఆపరేషన్ చెయ్యకపోతే ప్రాణాలు కూడా పోతాయని వాళ్లకు తెలియదు. వీళ్లు తెలియనివ్వరు. లోపల కొట్టుకుంటూ అంతా మంచిగానే ఉన్నామని కవరింగిస్తారు. పడవ మునిగేవరకు ఇలాగే ఉంటుంది.
(‘నమస్తే’ కాదది… ‘నమస్తే ఆంధ్రజ్యోతి”….రేపు)
