(మీడియా గాధలు-2)
చీమలు పెట్టిన పుట్టలు
పాములకిరువైనయట్లు..
పామరుడు తగు హేమంబు కూడబెట్టినా..
భూమీశుల పాలుజేరు భువిలో సుమతి..!
అది ఓ పత్రిక. అన్ని పత్రికల్లాగే అదీ అంతే. ఉద్యోగులుంటారు. పోతారు. తీసేస్తారు. కీలక విభాగాల్లో ఇన్చార్జిలు మారుతుంటారు. కొత్తవాళ్లొస్తూ ఉంటారు. ఎప్పుడూ వాళ్లే ఉండాలని లేదు. అది మీడియా రంగంలో సహజం. భద్రతలేని ఉద్యోగాలు ఎక్కడన్నా ఉన్నాయంటే.. అసంఘటితరంగంగా అతి బలహీనమైన రంగమేదైనా ఉన్నదంటే… అది మీడియానే. కానీ అన్ని పత్రికలు వేరు. నమస్తే తెలంగాణ పత్రిక వేరు. దాని పుట్టుక వేరు. దాని ఉనికి వేరు. ఉద్దేశ్యం వేరు. ప్రయోజనాలు వేరు. అందుకే ఈ పత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది.
తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో .. ఆంధ్ర మీడియా ఉద్యమానికి వీసమెత్తు సపోర్టు చేయకపోగా..దాడి చేసేది. బట్టకాల్చి మీదేసేది. అభూత కల్పనలు, అపోహలు, అభద్రతాబావాన్ని నింపి జనాన్ని పక్కదారి పట్టించాలని విశ్వప్రయత్నం చేసేది. అలాంటి సంధికాలంలో ఈ పత్రిక పుట్టింది. ఎన్నో కష్టాలకోర్చి, అవమానాలు తట్టుకుని నిలబడేందుకు ప్రయత్నించింది. ప్రజల్లో పేపర్ ఒకటి తెలంగాణ గురించి పుడుతుందని తెలిసినప్పుడు అప్పడు జనంలో వచ్చిన ఆనందం వేరు. స్పందన వేరు. కానీ, జీతాలివ్వలేని పరిస్థితి. ప్రతీ నెల మొదటి తారీఖు నుంచి పది తారీఖు వరకు వేచిచూసే దోరణి. పోయి ఎండీ గారిని బతిమిలాడి ఎలాగోలా సర్దుబాటు చేయండి సార్ అని అడుక్కునే పరిస్థితి ఉండే. ఇది బయట తెలియదు.
ఎందుకంటే.. అప్పటికే నమస్తే తెలంగాణ నిలబడదు. కొట్టుకుపోతుంది అని ప్రచారం మొదలయ్యింది. అలా ఇందులో ఆ పత్రిక నుంచి ఈ పత్రిక నుంచి తెలంగాణ మీద ప్రేమతో, అల్లం నారాయణ, కట్టాశేఖర్‌రెడ్డి పిలుపుతో, కేసీఆర్ అంటే అభిమానంతో చాలా మంది వచ్చారు. తక్కువ జీతానికే పనిచేసేందుకు ఒప్పుకున్నారు. ఇది మన పత్రిక అనే భావంతో ఆనందంతో పనిచేసేందుకు ముందుకు వచ్చారు. చాలా కష్టాలకోర్చారు. పత్రికకు ఓ రూపు తీసుకొచ్చేందుకు, పోటీపత్రికలకు ధీటుగా నిలబెడుతూనే.. తెలంగాణ ఉద్యమ వార్తలకు పతాక స్థాయి కవరేజీ ఇవ్వడం.. ఉద్యమానికి మరింత ప్రాణం పోసింది. తెలంగాణ సాకారంలో నమస్తే తెలంగాణ పత్రికది కీలక పాత్ర.
ఉద్యమానికి ఊతమిచ్చేలా,జీవం పోసేలా చేసిందీ పత్రిక, ఒక్క టీఆరెస్ వార్తలే కాదు.. అన్ని పార్టీల ఉద్యమ వార్తలకు ప్రాధన్యతనిచ్చింది. తెలంగాణ రావాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేసింది. అందుకోసం నమస్తే తెలంగాణలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఉద్యమకారులయ్యారు. సైనికుల్లా పనిచేశారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత అల్లం నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా వెళ్లిపోయాడు. కట్టాశేఖర్‌రెడ్డి కొత్త ఎడిటర్‌గా మారాడు. చాలా రోజుల పాటు అదే టీం, అదే టీం స్పిరిట్‌తో నమస్తే తెలంగాణ నడిచింది. ఓ కుటుంబంలోని సభ్యుల్లా పనిచేసుకున్నారు. ఇది మన పత్రికే అనే భావన అప్పటి వరకు కొనసాగింది. ఎప్పుడైతే కట్టాశేఖర్రెడ్డిని సమాచార శాఖ కమిషనర్‌గా పంపి… ఆంధ్రజ్యోతి నుంచి తీగుళ్ల కృష్ణమూర్తిని పట్టుకొచ్చి నమస్తే తెలంగాణ ఎడిటర్ కుర్చీలో కూర్చోబెట్టారో.. అప్పట్నుంచి ఉద్యోగులకు దుర్ధినాలు మొదలయ్యాయి.
ఆయన దృష్టిలో అప్పటి వరకు పనిచేస్తున్న ఉద్యోగులంతా దొంగలు, నమస్తేకు పట్టిన చీడ పరుగులు, ఇన్నాళ్లకు దాని మీదే ఆధాపడి బతుకుతున్న పరాన్న జీవులు, శేఖర్‌రెడ్డి అనుచరులు, అల్లం నారాయణ అనుచరులు, కేసీఆర్ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు. నవ్వొచ్చే విషయం ఏమిటంటే.. తెలంగాణ ఉద్యమ సమయంలో తీగుళ్ల పనిచేసింది ఆంధ్రజ్యోతిలో. పక్కా తెలంగాణ వ్యతిరేక వార్తలు రాసిన చరిత్ర ఉన్నది ఈయనకు. కానీ ఈయనే ఇప్పుడు తెలంగాణ సాధించిన వారిలో నేను కూడా ఉన్నాను.. అందుకే కేసీఆర్ నాకు ఈ బాధ్యత అప్పగించాడని సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నాడు. చాలా వేదికల్లో ఈ విషయాన్ని గర్వంగా, అతిశయోక్తిగా కూడా చెప్పుకున్నాడు.
అప్పుడున్న నమస్తే తెలంగాణ టీమ్‌ను తీసేయాలి. అదే మొదటి, ఆఖరి ప్రయార్టీ. తన నక్కజిత్తుల ఆలోచనలకు పదును పెట్టాడు. ఆయన ను చాలా దగ్గరగా ఉండి గమనించిన వారికి తెలుస్తుంది… నోటితో నవ్వుతు నొసటితో వెక్కిరిస్తాడని. అతను ఓ మాటన్నాడంటే.. అది పచ్చి అబద్దం.. దానికి వ్యతిరేకంగా చేస్తాడని మనం అనుకోవాలి. అదీ ఈయన తత్వం. వ్యక్తిత్వం. మాములు గెంటివేత కాదది, తీవ్రమైన , అవమాన కరమైన రీతిలో ఒక్కొక్కరినీ సాగనంపాడు. ఓ రకంగా తను కేసీఆర్ అనుకున్నాడు. చాలా సందర్భంలో కేసీఆర్‌లాగే ప్రవర్తించాడు. నాకు అడ్డు చెప్పేవారు లేరు. నేను దీన్ని పూర్తిగా మార్చేసేందుకు వచ్చాను. అని తనను తాను గొప్పగా కీర్తించుకునే వాడు. కీర్తించేవారిని కొందరిని చేరదీశాడు. ఇక ఒక్కొక్కరికి స్పాట్ పెట్టడం మొదలుపెట్టాడు. తేనే పూసిక కత్తిలా మాటలు. తడిబట్టతో గొంతులు కోసే రకం అన్నమాట. అలా అవమానించి పంపేశాడు.
ఉద్యమంలో గొంతెత్తి, కలాలతో కవాతు చేసిన ఆ స్వరాలు ఎందుకో ఎదురుతిరగలేదు.కేసీఆర్ మీద అభిమానమో… తెలంగాణ మీద ప్రేమో… తాము పురుడు పోసిన బిడ్డ ఈ పత్రిక అనే మమకారమో.. తెలియదు. ఆంధ్ర మోసాలు ఎలా ఉంటాయో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటగా చవిచూసింది తెలంగాణ ఉద్యోగులే. అదీ తీగుళ్ల ద్వారా. అంతకు ముందే మార్కండేయను వెళ్లగొట్టారు. కష్టకాలంలో పనిచేయించుకుని. ఆ తర్వాత ఓరుగంటి సతీష్ వచ్చాడు. మెల్లగా తిష్టవేశాడు. తీగుళ్లలాగే అతనూ తన ఉనికిని చాటుకునేందుకు ఉద్యోగులతో ఆడుకున్నాడు. శేఖర్‌రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సెట్ అయ్యాడు. మార్కండేయ సీటును ఎస్జీవీ ఆక్రమించాడు. అప్పటి వరకు ఓ మూలనున్న ఎస్జీవి తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. శేఖర్‌రెడ్డిని అంతా కలిసి వెళ్లగొట్టారు. ఇక పీడ పోయింది. మాదే రాజ్యమని ఓరుగంటి, ఎస్జీవీ అనుకుంటున్న తరుణంలో … తీగుళ్ల వచ్చి వీళ్ల ఆధిపత్యానికి గండికొట్టాడు. ఉద్యోగులను పీకేసే విషయంలో మాత్రం ఈ ముగ్గురిదీ తిలాపాపం తలాపిడికెడు.
(ఆ ముగ్గురి ఆధిపత్యం కోసం పత్రిక బలి…. రేపటి మీడియా గాధలు-3లో)
