బద్నాం రాజకీయాలకు తెరలేపింది బీజేపీ. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం.. ప్రధాని మోడీ పై తిరుగుబాటు… బీజేపీ యేతర కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు.. జాతీయ పార్టీ స్థాపన నేపథ్యంలో… బీజేపీ కేసీఆర్ పై నజర్ పెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వీరికి అస్త్రంలా దొరికింది. కవితకు అందులో ప్రమేయం ఉందని లీక్‌లు వదిలింది. వాస్తవంగా దీనిపై అధికారికంగా ఎక్కడా వెల్లడి కాలేదు. చెప్పలేదు. ప్రకటించలేదు. ఈడీ దాడులు చేయలేదు. కానీ బీజేపీ నేతలే ఆమె పేరును మీడియా ముందు వెల్లడించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా మీడియాలో ఆమెపై వార్తలొస్తూనే ఉన్నాయి. ఆమె వాటిని ఖండిస్తూ వస్తూనే ఉన్నారు.
తాజాగా హైదరాబాద్‌లో ఈ కేసులో జరిగిన ఈడీ దాడుల్లో కవితకు కూడా నోటీసులిచ్చారనే మీడియాలో వార్తలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏబీఎన్‌లో నైతే ఆమెను ఆ నోటీసులో ఏమేమీ ప్రశ్నలడిగారో కూడా వెల్లడిచేసింది. అయితే ఇదంతా ఉత్తిదేనని, అబద్దాల ప్రచారం చేస్తూ మీడియా అనవసరంగా తనను బద్నాం చేస్తున్నదని కవిత ట్వీట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీలో కూర్చున్న బీజేపీ పెద్దలు మీడియాకు లీకులిస్తూ తప్పుడు వార్తలు రాయిస్తున్నదని ఆమె మండిపడ్డారు.
మీడియా వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయలని హితవు పలికారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా.. అదిగో తోక ఇదిగో పులి అన్నట్టు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రస్తాననను తీసుకొచ్చేందుకు మీడియా ఉవ్విళ్లూరుతున్నది. దీనికి నిదర్శనంగా తాజాగా ఈడీ నోటీసుల వ్యవహారమే. కవితకు వాస్తవంగా ఎలాంటి నోటీసులు అందలేదు. కానీ, మీడియా మొత్తం కవిత ఇంటి ముందు మోహరించింది.