నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కొత్త కలెక్టరేట్ ఆమడదూరం. రవాణా సౌకర్యం లేదు. అంతా కొత్త. ప్రజావాణి కోసం ప్రతి సోమవారం అక్కడికి పోవాలంటేనే జనాలు నానా తంటాలు పడుతున్నారు. ఇంకా అలవాటు కాలేదు. అది ఓపెనింగ్ అయిన తర్వాత ఒక్కడ రియల్ రంగం పుంజుకుంటుందని అనుకున్నారు. అంతకు ముందే ఇక్కడ వందల ఎకరాలు కొనుగోళ్లు జరిగాయి. ఐదువేలకు ఉన్న గజం జాగా ఇప్పుడు 50వేల వరకు పలుకుతుంది. అంతా బాగానే ఉంది. అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ గిరాకీ లేదు. కొనుగోళ్లు లేవు. నిర్మాణాలు అసలే లేవు.
ఒక్కసారిగా ఎవరికీ అందనంత రేట్లు పెంచేయడమే దీనికి ప్రధాన కారణం. ఎకరాకు ఐదు కోట్ల నుంచి పది కోట్లకు ఎగబాకిందిక్కడ. గజానికి ఐదు వేల నుంచి యాభై వేలకు పెంచి ఎదురుచూస్తున్నారు. ఎవరూ రావడం లేదు. కానీ తగ్గేదేలే అన్నట్టు రేట్లు ఎవరూ తగ్గించడం లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకో ఏడాదికైనా పెరగకపోతాయా రేట్లు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ కొత్త కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యే ఏడాది దాటింది. ఆలోపు ఇక్కడ ఏమీ నిర్మాణాలు కాలేదు. జనానికి పెద్దగా రవాణా సౌకర్యమూ ఏర్పాటు కాలేదు. దీంతో రేట్లు అమాంతం ఆకాశానికి పెంచి వదిలేశారు. రియల్ రంగం మాత్రం ఒక్క అడుగు కూడా ఈ దరిదాపుల్లో ముందుకు కదలడం లేదు.