యాసంగి వరి ధాన్యం కొనగోలు చేయాలని కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో జరిగిన రైతు దీక్ష అందరి దృష్టిని ఆకర్శించింది. అధికార పార్టీ ఏకంగా రాజధానికి చేరుకుని మోడీపై విరుచుకుపడే సందర్భాన్ని అంతా ఆసక్తిగా గమనించారు. కేసీఆర్ ఇప్పటికే ఇక్కడ చాలా సార్లు ప్రెస్‌మీట్ ఎట్టి కేంద్రాన్ని, మోడీని ఎడాపెడా వాయించి వదిలిపెట్టారు. ఘాటుగా మాట్లాడారు. విమర్శలూ అదే స్థాయిలో చేశారు. ఇక ఢిల్లీ వేదికగా ఈ రోజు ఇంకా ఎలాంటి వాక్బాణాలు వదుల్తాడా అని అధికారపార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఎదురుచూశాయి. కానీ అంతా వాడీవేడీగా ఏమీ సాగలేదు ప్రసంగం. ఆచితూచి మాట్లాడాడు కేసీఆర్. కేవలం సమస్య మీదనే దృష్టి సారించాడు. గతంతో మాట్లాడిన మాటల్నే తనదైన శైలిలో హిందీలో తడబడకుండా మాట్లాడాడు. ఈ విషయంలో అందరి దృష్టిని ఆకర్శించాడు. కేసీఆర్ స్థానంలో మరొకరిని ఊహించుకోలేము..
ఓ చంద్రబాబో.. ఓ జగనో… ఈ స్థాయిలో అందరికీ అర్థమయ్యేలా హిందీలో అనర్గళంగా మాట్లాడటం అస్సలు ఊహించలేము. కేసీఆర్ స్పీచ్ అంటేనే అందుకే అందరికీ ఇంట్రస్ట్. కానీ ఆ స్థాయిలో ఆయన స్పీచ్ ఆకట్టుకోలేకపోయింది. అన్న పాత ముచ్చట్లే. ఏమన్నా అంటే దాడులు చేపిస్తామని బెదిరిస్తారంటూ కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడిన కేసీఆర్… మీ పార్టీలో అంతా సత్య హరిశ్చంద్రులున్నారా..? అన్నాడు. అంటే అందరూ దొంగలే.. అని అర్థం వచ్చేలా. ఆఖరికి రైతులకు ఏం చేయాలో మాకు తెలుసు.. మాకు ఆ సత్తా ఉంది.. అంటూ పరోక్షంగా ధాన్యం మేమేం కొంటామనే సంకేతమివ్వడం.. ఈ దీక్ష వేడిని మరింత తగ్గించింది. ఆ తర్వాత మిమ్మల్ని వదలం.. మీ వెంట పడతామని కేసీఆర్ ముక్తాయించాడు.