ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టు… యాసంగి ధాన్యాన్ని కేసీఆర్ కొనేందుకు అంగీకరించాడు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జరిగిన కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ముందుగా అందరూ ఊహించిందే. రైతుకు మాత్రం మొదటి నుంచి ధీమా. యాసంగిలో వరి వద్దంటే వద్దు అని ప్రభుత్వం మొత్తుకున్నా వినలేదు. కేసీఆరే ఎలాగోలా కొంటాడనే భరోసా… వరి తప్ప ఇంకా ఏమీ ప్రత్యామ్నాయాలకు వెళ్లలేని స్థితి, దుస్థితి. కొంత మంది మాత్రమే సాగుభూములను పడిత్‌గా వదిలారు. ఇంకొందరు ఆల్టర్నేట్ క్రాప్‌లకు వెళ్లారు.కానీ 80 శాతానికి పైగా వరే వేశారు.
ప్రభుత్వం కూడా ఇది ముందే గ్రహించింది. వారిస్తే కొంతలో కొంత తగ్గుతుందని భావించింది. కానీ రైతులు మాత్రం తగ్గేదేలే అని వరి వైపే మొగ్గు చూపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమే. కేంద్రం యాసంగిలో వచ్చే బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పేసింది. మరి కేంద్రం చేయాల్సిన బాధ్యత మరిచినప్పుడు… ఇది రైతులకు తెలియాలి కదా .. అందుకే టీఆరెస్ ఆందోళన బాట పట్టింది. అందరికీ అర్థమయ్యేలా కేంద్రం కొనుగోలు చేయకుండా చేతులెత్తేసింది… రైతులకు అన్యాయం చేస్తున్నదని గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు చేపట్టింది. అందరికీ కొంత అర్థమయ్యింది. రైతులకూ అర్థమయ్యింది. కానీ ఎలాంటి టెన్షన్ పడలేదు రైతులు. కేసీఆర్ ఎలాగోలా కొంటాడు.. మాకు మోడీతో ఏం చేసేది… బీజేపీతో పనేంటి అనుకున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. కేసీఆర్ సై అన్నాడు. తీసుకోకపోతే.. నష్టం జరిగేది టీఆరెస్‌కే. ఈ విషయంలో బీజేపీది కత్తీ కాదు.. నెత్తీ కాదు. అందుకే అది తమాషా చూస్తుంది. తమాషా చేస్తున్నది. కేసీఆర్‌కు ఇది తెలుసు. అందుకే తక్షణ కర్తవ్యం బోధపడ్డది. యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటన వచ్చేసింది. ఇది రైతులే కాదు.. అందరూ ఊహించిందే..
ఈ యాసంగి వరి రాజకీయంలో రెండు పార్టీలు ఓడిపోయాయి. రైతు గెలిచాడు. రైతులతో పెట్టుకుంటే ఏమవుతుందో పాలకులకు తెలుసు.
