అసలు ముచ్చటకైతే కేసీయార్ కు ప్రశాంత్ కిషోర్ అవసరమైతే ఉండదు.. మన సారే వాని కంటే పెద్ద
రాజకీయ చాణక్యుడు.. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏముంటది కొన్ని జిమ్మిక్కులు చేస్తడు, సోషల్ మీడియా ఎక్కువ వాడుతడు, బూత్ లెవల్ పోల్ మేనేజ్మెంట్ చేస్తడు, అభ్యర్థుల బలాబలాలను పార్టీకి ఇస్తడు, అవతలోల్ల మీద ఎట్ల ఎటాక్ చెయ్యాల్నో స్కెచ్ ఏస్తడు, ఎక్కడెక్కడ వీక్ ఉన్నరో దానికేం చెయ్యాల్నో రోడ్ మ్యాప్ ఏస్తడు, అన్ని నియోజకవర్గాల డాటా తెప్పిచ్చుకొని ఈక్వేషన్స్ చూస్తడు..
ఎక్కడ ఎన్నికలు సూస్కున్న వాడు చేశే పనే ఇది.. గుజరాత్ కెల్లి మొదలువెడితే మొన్న బెంగాల్, ఏపీ ఎన్నికలదాంక ఇదే చేస్కుంట ఒస్తుండు.. ఇగ కొన్ని డ్రామాలు కూడా దీన్ల ఉంటయనుకోర్రి.. కాళ్లకు కట్లు కట్టుడు, కోడికత్తితోటి పొడుసుడు, ఓటర్లు ఎట్ల రియాక్ట్ అయితదో సూశి దానికి సూటివెట్టే ఇసోంటియి కొన్ని ఒదులుతడు..
ఇవన్నీ సూశినంక ఆని కంటే మన కేసీయారే తోపు అనిపిస్తుంది కదా.. ఓటరు నాడి కెసీయార్ కంటే పీకే గానికి ఎక్వ ఏమన్న తెల్సా? తెలంగాణ ఒచ్చుడే కేసీయార్ సాధించిన విజయం.. ఎంత పోరాటం చేశినా, సకల జనులందరూ ఏకం అయినా, ఉద్యమాల గడ్డ ఉస్మానియా ఊపిరి పోసినా, అమరుల త్యాగం మనల్ని నడిపించినా, జేయెసీ ముందు కదిలినా, జయశంకర్ సారు కోదండరాం సారు లు మనల్ని ఉత్తేజపరిచినా, సోనియమ్మ సుష్మమ్మ దయ కలిగినా వీటన్నిటికి మన ముందు నడిచి చక్రం తిప్పింది మాత్రం కేసీయార్ అది వాస్తవం..
మరి కేసీయార్ కు పీకే అవసరం ఏమొచ్చింది అనేది నాకొచ్చిన పెద్ద డౌటు.. అధికారంలోకి రాంగనే సకలజనుల సర్వే, సమగ్ర కుటుంబ సర్వే అని డేటా మొత్తం తెప్పిచ్చుకొని, ఎవలికేం కావాల్నో, ఎవలికేం ఇస్తే పార్టీ మనుగడ సాగుతుందో, ఎక్కడ ఓటు బ్యాంక్ ఎక్కువుందో తెలుసుకొని చాలా పెద్ద రోడ్ మ్యాప్ గీసుకొని ఇయ్యాల అతిపెద్ద పార్టీ లెక్క తయారుచేసిండు.. దాన్లకెల్లి ఒచ్చినయే పించన్ల పెంపు, రైతుబందు, రైతుభీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్లు, ఐటీ కంపెనీలు, ఆకరికి అసలు బ్రహ్మాస్త్రం కాళేశ్వరం..
వీటిలల్ల మంచి జరిగే పథకాలు, జరిగిన పథకాలు ఉండొచ్చు కానీ వోటు బ్యాంకు పెంచిన, మాస్ ఫాలోయింగ్ పెంచిన పథకాలే ఇవన్నీ.. ప్రతో రాజకీయ నాయకుడు అదే కోణంలో ఆలోచిస్తడు.. కానీ అందరూ సక్సెస్ కాలేరు.. కేసీయార్ మాత్రం చాలాదాన్లల్ల సక్సెస్ అయిండు.. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడం, ఒకసారి ప్రెస్ మీట్ తోటి అంతా సెట్ చేయడం, తప్పు చెసినా ప్రజలతోటి తిట్లతో పాటు ఓట్లు రాబట్టుకోవడం, ప్రజల్లో తిరగకున్నా వారి అభిమానాన్ని పొందడం అందరివల్లా కాదు.. పీకే స్ట్రాటజీలకు కూడా అందని ఎత్తులు ఇవన్నీ.. ఒకరకంగా పీకేకే మన కేసియార్ పెద్ద గురువు.. ఎక్కడ ఎక్కాల్నో ఎక్కడ తగ్గాల్నో సుతం తెలుసు.. జీయర్ కు కుర్చీ ఎక్కిచ్చుడు, దొరతనం అది ఇది అనుకునేలోపటనే శిబూసోరెన్ కాళ్లు పట్టుకుంటడు.. ఒకవేళ దేశ రాజకీయాల కోసం అనుకున్న దానికి పీకే వల్ల లాభం పెద్దగ ఉండదని అనుకుంటున్న..
పీకే రాశిచ్చిన స్క్రిప్టులను పట్టుకొని సదివే గతి కేసీయార్ కు లేదు.. గంటలు గంటలు ప్రెస్మీట్ పెట్టి మాట్లాడగలడు, ఏ విషయం మీదనైనా చర్చించగలడు, ప్రజలకు ఎట్లాంటి మాటలతోటి దగ్గరవ్వాల్నో కేసీయార్ కు బాగా తెలుసు.. మరి పీకేకు 100 కోట్లు సమర్పించుకోవలసిన అవసరం ఏముంది.. పక్క పార్టీవోల్లు ఎక్కడ వాన్నెత్తుకపోతరో అని ముందే తీస్కొని పక్కకువెట్టుకుర్రు అని అనుకుంటున్న.. తెలంగాణల వానితోనైతే ఓట్లు రాలయి.. ఒక్క సోషల్ మీడియా పరంగ అయితే తెలంగాణల బీజేపీ ముందున్నది.. ఆల్ల ఐటీసెల్ బాగుంటది.. మంచి మంచి పనోల్లను పెడుతరు.. ఆ ఒక్క విషయంల మాత్రం సుదురాయించుకుంటే తిరుగుండది..
ముల్లును ముల్లుతోటే తియ్యాలని చెప్పి ఆ ముల్లును తెచ్చి పక్కల పెట్టుకోకుర్రి.. ఓ నాలుగోట్లు పోతయి వానితోని.. అయినా కేసీయార్ కు పీకే ఒచ్చి పాఠాలు నేర్పాల్శిన అవసరం లేదు.. గెలిశే గుర్రాల మీద ఎక్కి సవారి చేశి ఆని రేటు పెంచుకుంటడు అంతే.. నా ముచ్చటకైతే రాజకీయం విషయంల కేసీయారే పెద్ద తోపు.. బిజినెస్ మాన్ సినిమాల మహేష్ బాబు అంటడుగా అట్ల నాకు కేసీయార్ అంటే మోజు..
AKHILESH KASANI