గతంలో ఎన్నడూ లేని పరిస్తితిని ఇటు పాలకులు, అటు రైతాంగం ఎదుర్కోబోతున్నది. కేంద్రం యాసంగిలో వచ్చే బాయిల్డ్ రైస్ తీసుకోమని తెగేసి చెప్పిన తర్వాత రాష్ట్రం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో రైతులను ఈ సీజన్‌కు వరి వద్దని, ఇతర పంటల వైపు వెళ్లమని చెప్పినా.. అది పెద్దగా ప్రభావం చూపలేదు. ఇతర పంటల వైపు వెళ్లేందుకు రైతుకు అనుకూల వాతావరణం లేకపోవడం..వరి తప్ప వేరే పంట వేయడం కుదరని పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడానికే సిద్దమయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా నాట్లు జోరందుకున్నాయి. ఇతర పంటలకు వెళ్లలేక.. భూములను పడావుగా ఉంచలేక.. ఏదైతే అదైంది వరే వేయాలని డిసైడ్ అయ్యాడు రైతు.
ప్రభుత్వం కొనకపోతే మిలర్లకు 1300 వరకు కూడా అమ్మేందుకు రెడీ అవుతున్నారు. ఎమ్మెస్పీ కన్నా ఐదారు వందలు తక్కువకే అమ్మేందుకు కూడా మానసికంగా ప్రిపేరవుతున్నట్టు తెలుస్తోంది. కానీ అంత పెద్ద మొత్తంలో వరి వస్తే.. మిల్లర్లు అందరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా..? మరి మిగిలిన ధాన్యం కొనాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగితే.. అప్పుడు సర్కార్ మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తే.. ఇక్కడే వస్తుంది అసలు సమస్య. ఈ సీజన్ ఆరంభం నుంచే ప్రభుత్వానికి వరి టెన్షన్ మొదలుకానుంది. వరి కోతలు ముగిసే నాటికి పరిస్తితులు ఎలా ఉంటాయో చెప్పలేం.