జ‌ర్న‌లిస్టులంటే ఎర్న‌లిస్టుల‌ని సంబోధించారొక‌చోట సోష‌ల్ మీడియాలో ఒక‌డు. డ‌బ్బులు సంపాదించుకునేందుకు ఇదొక మార్గ‌మేమో ఒక‌ప్పడు. కానీ ఇప్పుడు కాదు. ఇందులో ఏదో గౌర‌వం దొరుకుతుంద‌నో.. ఇంకేదో సాధించ‌వ‌చ్చ‌నో భ్ర‌మ‌ప‌డి వ‌చ్చి.. ఆ రొచ్చులోంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌.. అప్ప‌టి వ‌ర‌కు అల‌వాటైన ఫాల్స్ ప్రెస్టీజీ గ‌జ్జికి లోబ‌డి.. గోక్కుంటూ స‌మ్మ‌గా రోజులు గ‌డుపుతూ.. జీవితాన్ని న‌ర‌క‌కూపంలోకి నెట్టుకునే వాడే అస‌లైన జ‌ర్న‌లిస్టు. త‌న జీవిత‌మే కాదు.. ఇంటిల్లిపాదినీ న‌ర‌క కూపంలోకి నెట్టి.. వారి జీవితాల‌నూ విషాదాంతాలుగా చేసుకునే జీవి ఈ జ‌ర్న‌లిస్టు.

ఐడెంటిటీ కార్డు కోసం, అక్రిడియేష‌న్ కోస‌మే త‌ను పుట్టాన‌ని అవి లేక‌పోతే త‌న జీవిత‌మే లేద‌నే భ్ర‌మ‌లో బ‌తికే వింత జీవి ఈ జ‌ర్న‌లిస్టు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియ‌క భ‌య‌ప‌డుతు బిక్కు బిక్కు మంటూ బ‌తుకుతు త‌న‌పై బాస్‌ల‌కు బానిస కుక్క‌లా ప‌డి ఉండే రోత బ‌తుకు జ‌ర్న‌లిస్టుది. బ‌స్ పాసుల కోసం, డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం, గ‌వ‌ర్న‌మెంటు ఇంకేదో చేస్త‌ద‌నే ఆశ కోసం.. సంఘంలో ప‌ర‌ప‌తి కోసం.. ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం.. ఇలా కాల‌యాప‌న చేస్తూ కాలాన్ని వృథాగా గ‌డుపుతూ.. కుటుంబాన్ని ప‌ట్టించుకోకుండా వారిని గాలికొదిలేసి… ఇళ్లూ ఒళ్లూ గుల్ల చేసుకుని రోగాల పుట్టగా మారి.. హెల్త్ కార్డులు, అక్రిడియేష‌న్ కార్డులు జేబులో ఉన్నా నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికి రావ‌ని తెలిసిన రోజు.. వాడో బ‌తుకున్న శ‌వం.

జీతం ఉండ‌దు.. జీవితం ఉండ‌దు. బతుకు ఉండ‌దు. ఆశ ఉండ‌దు. భ‌విష్య‌త్తు క‌నిపించ‌దు. ఆ క‌ళ్ల‌లో జీవం ఉండ‌దు. జీవ‌చ్చ‌వంలా వాడు మాత్రం బ‌తికే ఉంటాడు.. నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్టుగా.

గొప్ప జ‌ర్న‌లిస్టుగా పేరు కోసం పాకులాడి కుక్క చావు చ‌చ్చేవాడే నేటి జ‌ర్న‌లిస్టు.