కేసీఆర్ మాట తీరే అంతా. ఏ ప్ర‌సంగం విన్నా.. ఇంకా వినాల‌నిపిస్తుంది. మంచిగా ముచ్చ‌ట చెప్పిన‌ట్టు.. పాఠం అప్ప‌గించిన‌ట్టు.. మ‌న‌కు పెద్ద‌లు చెప్పే సుద్దులు చెప్పిన‌ట్టు మంచిగా విన‌సొంపుగా ఉంటాయి. మాట‌లు తియ్య‌గా ఉంటాయి. నీతి సూక్తులు కూడా ఉంటాయి. చ‌లోక్తులూ ఉంటాయి. పిట్ట క‌థ‌లూ అల‌రిస్తాయి. మ‌ధ్య‌లో న‌వ్విస్తాడు. చ‌ప్ప‌ట్టు కొట్టించేలా ప్ర‌సంగం ప‌దును ఉటుంది.

ఇదంతా ఓకే.. కానీ ఒక విష‌యంపై ప‌లు సంద‌ర్భాల్లో ప‌లు ర‌కాలుగా మాట్లాడ‌తాడు. ఆ సంద‌ర్భాన్ని బ‌ట్టి మాట మారుస్తా ఉంటాడు. అంత‌కు ముందు మాట్లాడింది కేసీఆరేనా అని మ‌న‌కే అనుమానం వ‌చ్చేలా ఉంటుంది తాజా ప్ర‌సంగం. అంతే ఎప్ప‌టికామాట‌లాడు అన్న‌ట్టుగా… సంద‌ర్బోచిత ప్ర‌సంగం అన్న‌మాట‌. ఈ రోజు మోత్కుప‌ల్లిని టీఆరెస్‌లో చేర్చుకున్నారు. హుజురాబాద్ పుణ్య‌మా అని ఇలా మూల‌కు ప‌డ్డ నేత‌ల‌కు, జ‌నాలు మ‌రిచిపోయిన లీడ‌ర్ల‌కు మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప‌ద‌వులు వాటంత‌ట అవే కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా మోత్కుప‌ల్లి చేరాడు. మామూలుగానే కేసీఆర్ ఇలాంటి వేదిక‌ల మీద పార్టీలో చేరిన వాళ్ల‌ను ఆకాశానికెత్తుతాడు. అత‌నికేదో పార్ట‌లో అత్యున్న‌త స్థానం, విలువా ఇవ్వ‌బోతున్నామ‌నే బిల్డ‌ప్పూ ఇస్తాడు. అవ‌న్నీ ఉత్త‌వే. ఆ మాట‌ల‌న్నీ ఆ స‌భ వ‌ర‌కే. కండువా క‌ప్పే వ‌ర‌కే. హుజురాబాదో.. ఇంకేదో లాభం జ‌రిగే వ‌ర‌కే. అంతే . స‌రే .. ఇది కాదు అస‌లు ముచ్చ‌ట చెప్పాల‌నుకున్న‌ది.

ఈ చేరిక స‌భ‌లో …ద‌ళిత బంధు గురించి మాట్లాడుతూ.. ఇది రాజ‌కీయం కోసం కాద‌న్నాడు. ప్ర‌తిదీ రాజ‌కీయం చేస్తారా? ఓట్ల కోస‌మే అని ఆలోచిస్తారా? అని ప్ర‌తిప‌క్షాల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌డిగిపాడేశాడు. దీనికీ చ‌ప్ప‌ట్లు ప‌డ్డాయి. మ‌రి .. ఇదే వేదిక‌పై కౌశిక్‌రెడ్డో.. పెద్దిరెడ్డో చేరిన స‌మ‌యంలో .. మాదేమ‌న్నా మ‌ఠ‌మా.? మాదీ రాజ‌కీయ పార్టే… మాకు ఓట్లు రావొద్దా..? ల‌బ్ది చేకూరొద్దా.. బాజాప్తా ద‌ళిత‌బంధును హుజురాబాద్‌లో పైల‌ట్ ప్రాజెక్టుగా ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని వ్యంగ్యంగా, ధీమాగా, భ‌రోసాగా, క‌చ్చితంగా, నిక్క‌చ్చిగా, ఆడంబ‌రంగా, ఉన్న‌దున్న‌ట్టుగా, నిర్భీతిగా, నిజాయితీగా చెప్పింది మీరే క‌దా సారు. ఏందో ఏమో అలా చెప్పిన‌ప్పుడూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. ఇప్పుడిలా మాట మార్చి నీతి సూత్రాలు, సూక్తి ముక్తావ‌ళి వ‌ల్లించిన‌ప్పుడూ చ‌ప్ప‌ట్లు ప‌డ్డాయి. కేసీఆర్ అంటే అంతే. ఏది చెప్పినా వీనుల విందుగా ఉంటుంది. అచేత‌నంగా మ‌న చేతులు మ‌న‌కు తెలియ‌కుండా అలా చ‌ప్ప‌ట్లు కొట్టి కేసీఆర్‌ను మ‌రింత ఉత్సాహ‌ప‌రుస్తాయి. అద‌న్న‌మాట సంగ‌తి. మీకేం అర్థం కాలేదా..? అదే మంచిది. చ‌ప్ప‌ట్లు కొట్టండి.