ఈసారి హుజురాబాద్‌లో జరిగినట్టుగా దసరా పండుగ ఎక్కడా జరగదు కావొచ్చు. అసలే కరువు. కరోనా కాలం. పనులు లేని సమయం. ఉద్యోగాలు ఊడిన గడ్డు పరిస్థితులు. ఈ సమయంలో పండుగంటే కొత్త బట్టలు, పిండి వంటలు, మందు, మటన్.. అబ్బబ్బ ఎన్నెన్ని ఖర్చులే. మన దగ్గర లేవని పండుగ చేసుకోకుంటా ఉంటామా? పసందుగా కాకపోయినా.. అందులో సగమైనా చేసుకుంటాం.
అసలే దసరా. తెలంగాణలో పెద్ద పండగ. అంతే చేసుకోవాల్సిందే. కానీ హుజురాబాద్ ప్రజలకు మాత్రం ఈసారి దసరా భలే పసందుగా, రంజుగా ఉండనుంది. అప్పటికే మూడు నెలల నుంచి ఇక్కడ పండుగ వాతావరణమే ఉంది. మరి ఏకంగా పెద్ద పండగ దసరానే వస్తే.. ఇక చెప్పడానికి మాటలు చాలవు. అంతలా పండుగను ఎంజాయ్ చేసేవారు ఇక రాష్ట్రంలో ఎవరూ ఉండరంటే నమ్మండి. అక్కడ ఈసారి హుజురాబాద్ ఎన్నిక ఉంది కాబట్టి.. ప్రజలకు పైకం ఢోకా లేదు. కొత్త బట్టలు తెచ్చుకుందామంటే రందిలేదు. మందు, మటన్‌కు అసలే బాధలేదు. అన్నీ వాళ్లే సమకూరుస్తారు.
వాళ్లంటే ఎవరు..? మరీ అంత అమాయకంగా అడుగుతారేంటీ బాసు..? మనవాళ్లే. అదే టీఆరెస్ వాళ్లు. ఇంటికి కిలో మటన్ పంపుతారట. ఆడబిడ్డలకు చీరల కోసం 2వేలు ఇస్తారట. ఇక మగవాళ్లకు .. అదే మనవాళ్లకు కావాల్సిందేముంటుంది. చుక్క, ముక్క. అది కావాల్సింత అరేంజ్ చేస్తారట. మందు తాగినంద. తినేంత ముక్కాబొక్కా. అబ్బ అదీ పండగంటే. దసరా ఇలా జరుపుకోవాలి. ఎంతైనా దేనికైనా పెట్టిపుట్టాలి బ్రదర్. ఖానేవాలేకా నామ్ ధానే ధానే పర్ లిక్తే అంటారు. ఇదేనేమో.
అహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని దూలానికి కట్టి చికెన్ తిన్నట్టు ఊహించుకుని తెల్లన్నం తిన్నట్టు.. మనం కూడా హుజురాబాద్‌లో మనవాళ్లు పండగ చేస్తున్న ఎంజాయ్‌మెంట్‌ను ఊహించుకుంటూ మనమూ అలాగే తిని తాగినం.. ఎగిరినం దుంకినం…ఎంజాయ్ చేసినం అని అనుకోని ముర్వాలె. అంతే మరి. చేసేదేమీలేదు బ్రదర్. ఈసారికిలా సరిపెట్టుకోండి. తర్వాత మనకూ హుజురాబాద్‌లు రాకపోతాయా? మనమూ రోజూ పండుగలు చేసుకోకపోతామా?