ఇది నాయకుల తీరును బట్టి నడుస్తున్న ట్రెండో.. లేదో నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు కొంత మంది భజన లీడర్లు, పత్రికలు అవలంభిస్తున్న విధానమో తెలియదు కానీ.. ఇప్పుడు ఇదో పనికిమాలిన పద్దతి నడుస్తున్నది తెలంగాణలో. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆమాంతం ఆకాశానికెత్తే బ్యాచొకటి రెడీ అయ్యింది. ఇలాంటి బ్యాచులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పత్రికలు కూడా అందులో చేరాయి. ఇప్పుడే ఉందా ఈ విధానం? అప్పుడు లేదా సమైక్య రాష్ట్రంలో?? అంటే ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది. కేసీఆర్ కూడా దీనికే మింగిల్ అవుతున్నట్టున్నాడు. ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. ఇదే కోరుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ బ్యాచ్ బాండ్ బాజా సౌండ్ రోజు రోజుకు పెంచుకుంటూ పోతోంది. ఆఖరికి రామోజీ అంతటి వాడే మోకరిల్లు.. దండాలు పెట్టే స్థాయికి వచ్చాడంటే.. మరి పరిస్థితి అలా ఉందన్నమాట. అలా ఉంటేనే పనులవుతాయి. అనువుగానీ చోట అనుకూలమనరాదు.. అన్నట్టు లోకరీతి తెలిసిన పత్రికల యజమానులు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు.
సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు .. ఏవీ దీనికి మినహాయింపు కాదు… సరే, ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు.. అసలు విషయానికి రా.. అంటారా.. అయితే ఇది చూడండి. ఈ రోజు నమస్తేలో వచ్చిన స్టోరీ. వాస్తవంగా వరిసాగు పెరిగింది. నీటి లభ్యత, వనరులు కూడా విపరీతంగా పెరిగాయి. మంచి పరిణామమే. కానీ రైతులు వరికే పోతున్నారు. ఇదే అసలు సమస్య. తక్కువ పెట్టుబడి, రిస్కు లేదు. మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి గింజా కొంటుంది. ఇవీ దీనికి కారణాలు. కానీ ప్రభుత్వానికి ఈ ధాన్యం కొనుగోలు వ్యవహారం చాలా పెద్ద భారంగా మారుతూ వస్తోంది. మొన్నటికి మొన్న కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పింది కాబట్టి.. సర్కారు కూడా యాసంగిలో వరి వెయ్యకండని గట్టిగా చెబుతున్నది కానీ.. అలా చెప్పేందుకు కూడా మొన్నటి వరకు భయపడే పరిస్థితులే. ఎందుకంటే రైతులు అంతలా దీనికి సెట్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు వద్దంటే ఊరుకునేలా లేడు. ప్రత్యామ్నాయం వైపు తీసుకెళ్లడం చాలా కష్టమైన పనిగా మారింది. దీనికి తోడు ప్రతిపక్షాల రాద్దాంతం.
ఇవన్నీ ఇలా ఉంటే… వరిసాగు పెరిగింది. మనమే ఫస్ట్. మనమే ఆదర్శం. దేశానికే అన్నం పెడుతున్నాం. కాళేశ్వరమే కారణం. కేసీఆరే దీనికంతటికి మూలాధారం.. ఇలా సందర్భం వచ్చిన ప్రతీసారి ఇటు మీడియా.. అటు మన నేతలు చెబుతారు. సరే, నిజమే. గొప్పలు చెప్పుకోవడానికి ఇది బాగానే ఉంది. కానీ దీని వెనుక ఎంతటి ఆర్థికపరమైన భారాన్ని ప్రభుత్వం మోస్తుందో తెలియదా? తెలుసు. మరి దాన్ని కంట్రోల్ చేయాలని అనిపించదా? అనిపిస్తుంది. కానీ సాధ్యం కాదు. మరి సాధ్యం కాదు కాబట్టి.. గొప్పలు చెప్పుకునే ఏ సందర్భాన్నీ వదలొద్దు. గట్టిగా డప్పు కొట్టి చెప్పాలి. ఇలా ఫస్ట్ పేజీలో పరచాలి. కేసీఆర్ చేత శభాష్ అనిపించుకునే ప్రతీ క్షణాన్ని దుర్వినియోగం చెయ్యొద్దు… ఆయన నజర్‌లో పడి జీవితం ధన్యం చేసుకోవాలి. ఇలా తయారయ్యింది మన వ్యవస్థ. యథా రాజా తథా ప్రజా అంటారా? కానీ, అలాగే అనుకుందాం.. భేష్ .. వరిసాగులో మనమే అగ్రగామి. కానీ యాసంగిలో మాత్రం వరి వేయకండి ప్లీజ్…