వరి సాగును నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయాసలు పడ్డది. కానీ అవన్నీ బెడిసి కొట్టాయి. కేసీఆర్ ఏమి చేయలేక ఈ విషయంలో మిన్న కుంగిపోయాడు. కానీ కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నుట్టుగా కేంద్రం తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ఆలోచనలకు జీవం పోసింది. ‘వరిని ఎలా తగ్గించాల’ని జుట్టు పీక్కుంటున్న ప్రభుత్వం నెత్తిమీద కేంద్ర ప్రభుత్వం పాలు పోసింది.
బాయిల్డ్ రైస్‌ను ఇక కొనేది లేదంటూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో యాసంగిలో వరి విస్తీర్ణం పూర్తిగా తగ్గించడమే ఏకైక మార్గమనే సంకేతమిచ్చింది. ఇక కేసీఆర్ తన పాత ఆలోచనకు పదును పెట్టాడు. వరిని గణనీయంగా తగ్గించేందుకు ఇదో అస్త్రంగా వాడుకోనున్నాడు. కాళేశ్వరం జలాలతో వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, దేశానికే తెలంగాణ రాష్ట్రం కూడు పెట్టే దిశగా ఎదిగి ఆదర్శంగా నిలిచిందని గొప్పులు చెప్పుకున్న మన నేతలు… ఆ తర్వాత వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు. గొప్పలకు, ప్రచారానికి వరి సాగు, దిగుబడి పెరిగిందని చెప్పుకుంటు వచ్చిన లీడర్లు… మద్ధతు ధర ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేసే క్రమంలో తడిసి మోపేడైన బడ్జెట్ భారాన్ని మోయలేక మోకరిల్లిపోయారు.
ఆ తరువాత కేసీఆర్ ‘నియంత్రిత సాగు’ పేరుతో వరిని కట్టడి చేయాలని తీవ్ర ప్రయత్నం చేశాడు. కానీ కుదరలేదు. రైతులు వినలేదు. ధాన్యం కొనుగోలు ప్రభుత్వం బాధ్యత కాదంటు రైతులను బలవంతంగానైనా వరి సాగు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రకటన విమర్శల పాలైంది. దీంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ఆలోచనలకు మళ్లీ జీవం పోసింది. మోడీ కేసీఆర్‌కు బ్రహ్మాస్త్రాన్ని అందించినట్లయింది. ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నుంచి తప్పుకునేందుకు ఒక రూట్ క్లియర్ అయింది. ఇప్పుడు అదే పనిలో కేసీఆర్ ఉన్నాడు. ఈ యాసంగి నుంచి వరిని ఎక్కడికక్కడ కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నాడు. కానీ రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం.
