ఉద్యమంలో కలిసి నడిచిన వారిలో ఇయ్యాల నిజమైన తెలంగాణ ఉద్యమకారులం అని ఇయ్యాల చెప్పుకు తిరిగేటోళ్ళు, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అని ప్రచారం చేసేటోళ్ళు, బహుజన తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అని పడికట్టు పదాలతో ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది నిజమైన తెలంగాణ వాదులు కాదు. వాళ్ల వాళ్ల సొంత అజెండాలు ఉన్నాయి. కొందరు ఉద్యమం ముసుగులో తమ సొంత పలుకుబడి, తమ సంస్థల కార్యకలాపాలు పెంచుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో వచ్చిన వాళ్ళు. మరి కొందరు ఉద్యమం కారణంగా రాజకీయంగా, శాంతిభద్రతల పరంగా ఏర్పడే అస్థిరత్వం వల్ల, ప్రభుత్వం పట్ల ప్రజలలో పెరిగే వ్యతిరేకతతో లాభం పొందుదాం అనుకోని వచ్చిన వాళ్ళు. ఇంకా కొందరు తెలంగాణ ఏర్పడిన తరువాత వచ్చే ప్రభుత్వం బలహీనంగా ఉంటది, ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసి లాభం పొందొచ్చు అని ఆశించిన వాళ్ళు.
వీళ్ళందరూ కేసీఆర్ బొంత పురుగును కూడా ముద్దాడుతా అనే వైఖరి వల్లనే ఉద్యమ ప్రధాన స్రవంతిలో పాల్గొనే అవకాశం కలిగిన వాళ్ళు. కేసీఆర్ కన్న ముందు నుంచే ఉద్యమంలో ఉన్నామని చెప్పుకోవచ్చు కానీ ప్రజా బాహుళ్యంలో వారికి అప్పుడు ఉండిన స్థాయి, అప్పటి ఉద్యమ స్థాయి, సామాన్య ప్రజలకి తెలంగాణ అంశం పట్ల అప్పుడు ఉండిన అవగాహనను పరిశీలిస్తే వాళ్ల మాటల్లోని డొల్లతనం బయట పడతది.
ఉద్యమ సమయంలో గానీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత గాని కేసిఆర్ స్పష్టమైన అవగాహనతో, రాజకీయ వ్యూహ చతురతతో ముందుకు పోవడం వల్ల వాళ్ళు ఆశించిన ప్రయోజనాలు నెరవేరక పోవడం వాళ్ళకున్న ప్రధాన సమస్య. ఈ విధంగా కేసిఆర్ కొరకరాని కొయ్య అయితడు అనుకుంటే చాలామంది తెలంగాణ ఉద్యమంలో కలిసి రావడం అటుంచి వ్యతిరేకించేటోళ్ళు అచ్చం ఇప్పుడు ప్రాజెక్టులను వ్యతిరేకించినట్టు.
ఉన్న మాట కూడా చెప్పుకోవాలి. వాళ్ళందరూ లేకపోతే కేసిఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ వచ్చేదా అంటే ఖచ్చితంగా రాకపోయేది. అయితే అందులో వారి ప్రత్యక్ష పాత్ర కన్నా కేసిఆర్ వాళ్ల ఉనికిని చాకచక్యంగా ఉద్యమానికి అనుకూలంగా వాడుకోవడం వల్ల ఎక్కువ లాభం జరిగింది.
..
By
Udaya Bhaskar Keshavadasu
