నమస్తే తెలంగాణను ఉద్దరించేందుకు కంకణం కట్టుకొని ఉద్యోగులను ఎడాపెడా పీకేసీ రోడ్డుపాలు చేసిన ఎడిటర్ నేతృత్వంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. పత్రిక పరువు బజారున పడే పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. పాపం.. ఇనవ్నీ ఎడిటర్‌కు తెలిసి ఉండదు. ఎందుకంటే.. ఆయనను సీయేం స్వయంగా నియమించాడు. పత్రికను ఉన్నతస్థానంలో పెట్టాలని సూచించాడు. కాబట్టి తనకు తెలియకుండా తెరవెనుక ఎవరో ఏమో చేస్తున్నట్టున్నారు.
అన్ని జిల్లాల్లో బ్యూరో ఇన్‌చార్జిలను అవమానకర రీతిలో సాగనంపాడు ఎడిటర్. అంతా సమాజహితం కోసమే..అంటే పత్రిక హితం కోసమన్నమాట. నిజంగా తనకు ఎవరిపైనా ఎలాంటి పగ, కసి, కోపం, ద్వేషం.. వగైరాలేమీ లేవు. కానీ వ్యవస్థను మార్చాలనుకున్నాడు. బాగానే ఉంది. మరి ఖమ్మంలో ఏంటీ .. ఓ చీటర్‌ను, మోసగాడిని.. ఎఫ్ఐఆర్ నమోదైన ఓ సబ్ ఎడిటర్‌ను తీసుకొచ్చి నమస్తే తెలంగాణలో విలేకరిగా పెట్టుకున్నారు. అక్కడ అసలేం జరిగింది? ముఖ్యులు ముగ్గురి ఆధిపత్యం కోసం జిల్లాలపై తమ పట్టుకోసం ఎవరిని పీకేస్తున్నారో..? ఎవరిని తెచ్చిపెట్టుకుంటున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం బ్యూరో ఇన్చార్జిగా ఉన్న రవీందర్‌ను అవమానకర రీతిలో తొలగించాడు కృ.తి. అక్కడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఒకరిని బ్యూరో ఇన్‌చార్జిగా నియమించాడు. ఓ సబ్ ఎడిటర్‌కు ఎందుకు అవకాశం వచ్చిందో తెలియదు? అంతలా అతను ఏమి పొడిచి రాశాడో కూడా తెలియదు. ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి.. అప్పటికే నమస్తే తెలంగాణ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన వార్త సబ్ ఎడిటర్‌ను తీసుకొచ్చి నమస్తేలో పెట్టుకున్నాడు. దీనికి హైదరాబాద్ ముగ్గురు పెద్దలూ సై అన్నారు. దీని వెనుక మతలబేమిటో తెలియదు. తెలవాల్సిన పనిలేదు. చెప్పాల్సిన అవసరం వాళ్లకీ లేదు. ఎందుకంటే .. ఇప్పుడంతా వారిదే రాజ్యం. ఎవరూ అడిగేవారుండరు.
అప్పటి వరకు పనిచేస్తున్న నమస్తే తెలంగాణ రిపోర్టర్‌ను పీకేసీ… ఆ స్థానంలో 419,420,384 సెక్షన్ల కింద ఎఫ్ ఐ ఆర్ నమోదైన ఓ సబ్ ఎడిటర్‌ను తీసుకొచ్చి నమస్తేలో పెట్టుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కొత్త బ్యూరోకు .. మన ముగ్గురు పెద్దలకు ఏమీ తేడా వచ్చిందో తెలియదు… అతన్నీ పీకేశారు. ఆ స్థానంలో సాక్షిలో పనికిరావు పో… అని ఆంధ్రకు ట్రాన్స్ ఫర్ చేసిన ఓ రిపోర్టర్ ను తీసుకొచ్చి కళ్లకద్దుకొని పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడి, ప్రాణాల పణంగాపెట్టి.. ఆరోగ్యం పాడుచేసుకున్న రవీందర్‌ను మెడపట్టి బయటకు గెంటేశారు. సాక్షిలో పనికిరాని వాడు .. ఇప్పుడు నమస్తేలో ఓ జిల్లాకు పెద్దై కూర్చున్నాడు. ఇదీ మన పెద్దల ఘనకార్యం. ఇలా పత్రికను గాడిలో పెట్టి.. నెంబర్ వన్ పొజిషన్‌లో నిలిపేందుకు ఒకరికి మించి మరొకరు తాపత్రయ పడుతున్నారన్నమాట. గతంలో కూడా మెదక్‌లో ఓ సాక్షి నుంచి గెంటేసిన ఓ ఉద్యోగిని కళ్లకద్దుకొని పెట్టుకున్నారు మన పెద్దలు. అంతే.. పొరిగింటి పుల్లకూర రుచి కదా. మనకంటూ ఓ టీం ఉండాలంటే తప్పదు. కొందరిని బలిపెట్టాలి. కొందరిని ఆకాశానికెత్తాలి. కొందరిని దొంగలుగా ముద్రవేయాలి. ఇంకొందరు దొంగలుగా ముద్రపడ్డవారికి మనమే ఉద్యోగంలో పెట్టుకుని క్లీన్ చీట్ ఇవ్వాలి. పక్కనోడు పనికిరాడంటే.. మనం కళ్లకద్దుకోవాలి. మనోడు మాత్రం మట్టికొట్టుకుపోవాలె. మనం ఇలాగే కలకాలం వర్దిల్లాలె…