పొగ‌తాగ‌నివాడు దున్న‌పోతై పుట్టున్‌… క‌న్యాశుల్కం నాటకంలో గిరీశం డైలాగ్ ఇది. ఇప్పుడు దీన్ని కొంత మార్చి మ‌న రాజ‌కీయాల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు అన్వ‌యించుకోవాలి. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డాలంటే, గెల‌వాలంటే.. ఓట్లు కొల్ల‌గొట్టాలంటే ఏమి చేయాలి? చాంతాడంత అమ‌లు కాని హామీలు, ప్ర‌చారాలు, భారీ బ‌హిరంగ స‌భ‌లు… ఇవ‌న్నీ చేస్తారు. కానీ ఎన్ని చేసినా పైస‌లు పంచాలి.. మందు తాగించాలె. ఇదీ ఎన్నిక‌ల్లో చివ‌రి ఘ‌ట్టం. ఓట‌ర్ల‌కు నాయ‌కులు ప్ర‌లోభ‌పెట్టే చివ‌రి అస్త్రం. ఎంత‌టి నేతైనా.. నేను చేసిన అభివృద్ధి ఎవ‌డూ చేయ‌లేద‌ని ఢంకా బ‌జాయించి చెప్పినా.. నేనే నెంబ‌ర్ వ‌న్.. నా పార్టీ నెంబ‌ర్ అని పొద్దున్న లేచిన‌కాడ్నుంచి అరిగిపోయిన గ్రామ‌ఫోన్ రికార్డులాగా ఊద‌ర‌గొట్టే .. ఎవ‌రైనా ఓట‌రుకు ఓటుకింత‌ని పైస‌లు పంచాలె. లిక్క‌ర్ పంచాలె. అంతే. లేదంటే ఎన్ని గ‌ప్పాలు కొట్టినా.. ఎంత ప్ర‌చారం చేసినా.. బెడిసికొడుతుంది వ్య‌వ‌హారం. అలా త‌యారుచేశారు ప్ర‌జ‌ల‌ను మ‌న నేత‌లు. అందుకే ఇది త‌ప్పు కాదు. త‌ప్పు కానే కాదు. రాజ‌కీయాల్లోకి రావాల‌నుకునే కొత్త త‌రం నేర్చుకుని పాటించి ప‌ద‌వులు ద‌క్కించుకుని, అధికారాన్ని వెల‌గ‌బెట్టేందుకు ఉప‌యోగ‌ప‌డేది ఈ కీల‌క‌ఘ‌ట్ట‌మే.

You missed