(దండుగుల శ్రీనివాస్)
బీఆరెస్ నెత్తికెత్తుకోవడానికి చేస్తున్న బీసీవాదం ప్రయత్నం అపహాస్యం పాలవుతున్నది. తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ రోజూ కూడా.. శాసనసభలో కానీ పార్టీలో గానీ చర్చకు రాకుండా అడ్డుకున్న నాటి బీఆరెస్ సర్కార్.. నేడు కాంగ్రెస్‌ను చూసుకుని వాత పెట్టుకోవాలని చేసే యత్నం సోషల్ సర్కిళ్‌లో బెడిసికొడుతున్నది. కనీసం బీసీ సబ్‌ప్లాన్ కోసం అసెంబ్లీలో చర్చ జరుపుదామని ప్రయత్నించిన బీజేపీ నాయకులపై ఆగ్రహించిన బీఆరెస్.. ఇవాళ ఆ వాదం పేరుతో మార్కులు కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కోటాను తగ్గించడానికి పరోక్షంగా కారణమైన బీఆరెస్‌ను బీసీవాదంతో పోరాడుతున్న వారు నమ్మే పరిస్థితి లేదు.
ఇప్పుడంతా బీసీ జపం నడుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు కాంగ్రెస్ సర్కార్ ప్రకటించడమే తరువాయి.. దీనిపై ఎవరికి వారే బీసీల మద్దతు కోసం పాకులాడుతున్నారు. బీఆరెస్ మాత్రం ఈ బీసీల రేసులో బాగా వెనుకబడిపోయి.. బీసీలను ఓన్ చేసుకోలేక ఓడిపోయి వాడిపోతున్నది. అధికారంలో ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్లను తగ్గించి అధికారమే పరమావధిగా చక్రాలు తిప్పి, వ్యూహాలు పన్ని తనను మించిన ఘనుడు లేడని అనుకున్న కేసీఆర్‌కు ఇప్పటి ఈ పరిస్థితి ఆశనిపాతంలా తాకింది. బీసీల నమ్మించే ప్రయత్నం చేసినా నమ్మేలా లేరు. కాంగ్రెస్‌కు మైలేజీ పోకుండా ఆపుదామన్నా అది సాధ్యమయ్యేలా లేదు.
కానీ ఏం చేయాలి..? ఏదో చేయాలి..? ఏదో ఒకటి చేయాలి..! అందుకే హడావుడి పిలుపొకటి ఇచ్చాడు అధినేత కేసీఆర్. ఉన్నపళంగా అన్ని జిల్లాల నుంచి పది నుంచి ఇరవైమందికి తగ్గకుండా అంతా ఇందిరాపార్క్‌కు రావాలె. బీసీల మహాధర్నా చేపట్టాలె. అనుకున్నంత మంది రాకున్నా ధర్నా అయితే చేశారు. కేసీఆర్ ఎత్తేసిన ధర్నాచౌక్ వద్ద. అదీ పార్టీ గొడుకు కింద కాదు. బీసీల ప్రతినిధుల ఫోరం అట. అవే కండువాలు వేసుకుని, ఫ్లకార్డుల చేబూని.. అలా అలా ఏదో అయిందనిపించారు. ఓ కేటీఆర్, ఓ హరీశ్‌రావు…. మాట్లాడేందుకు రాలేదు. అక్కడ వారి ముఖం చెల్లదు. నమ్మేవారు లేరు. అసలు పార్టీ కండువానే అక్కడ కనిపించలేదు. అక్కడ కవిత బీసీల కోసం నేనే చేశానన్నది. కానీ ఆమే పార్టీ కండువా వేసుకోలేదు. మొత్తానికి గులాబీ కండువే బీసీలకు వ్యతిరేకి. అది వేసుకుని బీసీల కోసం మాట్లాడడమే పేద్ద పొరపాటని ఆ గులాబీ నేతలే గ్రహించారు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451